Leading News Portal in Telugu

హైదరాబాద్‌లో 126 కంటైన్‌మెంట్స్.. బయటకు రావొద్దని సీఎం కేసీఆర్ ఆదేశం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారిలో జిహెచ్ఎంసి పరిధిలోని వారే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నందున హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరాన్ని జోన్ల వారీగా విభజించి, ఒక్కో జోన్ ను ఒక్కో యూనిట్ గా పరిగణించి, ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. పాజిటివ్ కేసులు నమోదైన కంటైన్మెంట్ల ను మరింత పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. దేశంలో, రాష్ట్రంలో, సరిహద్దు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యశాఖ అన్ని విధాలా సర్వసన్నద్ధంగా ఉండాలని కోరారు.

కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటన్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. సోమవారం కొత్తగా 32 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఒకరు మరణించారని అధికారులు సిఎంకు వెల్లడించారు. పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో అన్ని లాబరేటరీలను, ఆసుపత్రులను సిద్ధం చేశామని చెప్పారు. ఒక్క రోజు వెయ్యి నుంచి 11 వందల మందికి పరీక్షలు నిర్వహించే విధంగా, ఎన్ని కేసులొచ్చినా వైద్యం అందించే విధంగా వ్యవస్థను సిద్ధం చేసినట్లు వివరించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు, ఇతర జిల్లాల్లో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ప్రయత్నాలను, లాక్ డౌన్ అమలును, ధాన్యం కొనుగోళ్ల వ్యవహారాలను సిఎం సమీక్షించారు. కొందరు జిల్లా అధికారులతో నేరుగా మాట్లాడి పలు సూచనలు చేశారు.

‘‘పాజిటివ్ కేసుల ఆధారంగా రాష్ట్రం మొత్తం 246 కంటైన్మెంటులు ఏర్పాటు చేశాం. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 126 కంటైన్మెంటులున్నాయి. వీటిని మరింత పకడ్బందీగా నిర్వహించాలి. ఈ కంటైన్మెంట్లలోని ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానీయవద్దు. బయట వారిని లోపటికి పోనీయవద్దు. ప్రతీ కంటైన్మెంటుకు ప్రత్యేక పోలీసు అధికారిని, నోడల్ అధికారిని నియమించాలి. వారి ఆధ్వర్యలో అత్యంత కఠినంగా నియంత్రణ చేయాలి. ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులను ప్రభుత్వ యంత్రాంగమే అందించాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.