Leading News Portal in Telugu

కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ధరపై దుమారం.. స్పందించిన ఏపీ సీఎం జగన్

ఏపీలో కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలు వ్యవహారంపై దుమారం రేగుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఒక్కో కిట్‌కు రూ.337 చెల్లిస్తే.. ఏపీ ప్రభుత్వం మాత్రం రూ.817 లెక్కలు చెబుతోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కరోనా కష్ట సమయంలోనూ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల పేరిట కమిషన్లు దండుకుంటున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో కొరియా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ధరలపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. కరోనా నివారణపై సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్షాల నుంచి వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. ICMR (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) అనుమతిచ్చిన సంస్థకే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చిందని ఆయన చెప్పారు. ఒక్కో కిట్‌ను రూ.795కు కొనుగోలు చేయాలని ఐసీఎంఆర్‌ పేర్కొందని.. ఐనప్పటికీ ఏపీ ప్రభుత్వం. రూ.65 తక్కువకే కొనుగోలు చేశామని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినప్పుడు కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు బయట దేశంలో తయారయ్యాయని.. అదే సంస్థ నుంచి మనదేశంలో తయారీకి ICMR అనుమతి ఇచ్చాక కిట్ల ధర తగ్గిందని వైఎస్ జగన్ తెలిపారు. మొత్తం ఆర్డర్‌లో ప్రస్తుతం 25శాత మాత్రమే చెల్లింపులు చేశామన్న జగన్.. ఒక వేళ ఏ రాష్ట్రానికైనా తక్కువ ధరకే కిట్లను అమ్మితే ఆ ధర ప్రకారమే చెల్లిస్తామని సదరు ఆర్డర్‌లోనే షరతు పెట్టామన్నామని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం పెట్టిన షరతు మేరకు ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ధర తగ్గించేందుకు తయారీ సంస్థ అంగీకరించిందని జగన్ చెప్పారు. చాలా నిజాయతీగా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను కొనుగోలు చేశామని ఆయన తెలిపారు. ప్రజాధనాన్ని కాపాడిన వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఈ సందర్భంగా ప్రశంసించారు ఏపీ సీఎం.