Leading News Portal in Telugu

తీరని ఆత్మఘోష.. అయేషామీరా హత్యా కేసు.. 12ఏళ్ల తర్వాత రీపోస్టుమార్టమ్..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా మృతదేహానికి రీపోస్ట్మార్టమ్ నిర్వహించారు. 2007లో హత్యకు గురైన అయేషా మీరా మృతదేహానికి సీబీఐ 12 ఏళ్ల తరువాత శనివారం రీపోస్ట్‌మార్టమ్ చేశారు. ఫోరెన్సిక్ బృందం సేకరించిన ఆధారాలు, అవశేషాలను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయేషా మీరా హత్య కేసు విచారణకు సీబీఐకు అప్పగించడంతో ఆధారాల సేకరణ కోసం ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట స్మశానంలో రీపోస్టుమార్టమ్ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. సీబీఐ ఎస్పీ విమల్ ఆదిత్య నేతృత్వంలోని ఎనిమిది మంది బృందం నాలుగు గంటల పాటు రీపోస్టుమార్టం చేశారు. అయేషా మీరా హత్య కేసులో కీలకంగా ఉన్న ఎముకలు, పుర్రె చిట్లిన గాయాలను గుర్తించినట్లు తెలిసింది. సీబీఐ టీంలోని ఫోరెన్సిక్ వైద్యులు ఆయేషా మృతదేహం ఎముకల నుంచి అవశేషాలను సేకరించింది.

రీపోస్టుమార్టమ్‌లో లభించిన ఆధారాలు, మృతదేహం నుంచి సేకరించిన అవశేషాలను అధికారులు ప్రత్యేక బాక్స్‌లో భద్రపరిచి సీలు చేశారు. అయేషా మృతికి కారణాలపై సీబీఐకి ఫోరెన్సిక్ బృందం నివేదిక సమర్పించనుంది. నివేదిక ఆధారంగా సీబీఐ తదుపరి విచారణ ప్రక్రియ చేపట్టనున్నారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద బీఫార్మసీ చదువుతున్న ఆయేషా మీరా 2007 డిసెంబర్‌ 27వ తేదీ అర్థరాత్రి దారుణ హత్యకు గురైంది. దీంతో అప్పట్లో విద్యార్థి, ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి.

అయేషా హత్య కేసులో దోషులకు శిక్ష విధించాలని డిమాండ్ చేశాయి. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు కృష్ణా జిల్లాకు చెందిన సత్యంబాబును అనుమానించి 2008 ఆగస్టులో అరెస్టు చేశారు. పోలీసు దర్యాప్తు ఆధారంగా అయేషా హత్య కేసు విచారించిన విజయవాడ మహిళా సెషన్స్‌ స్పషల్ కోర్టు 2010లో సత్యంబాబుకు 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పుపై సత్యంబాబు హైకోర్టుకు ధరఖాస్తు చేసుకోగా 2017 మార్చి 31న సత్యంబాబును నిర్దోషిగా తేల్చి తీర్పు వెల్లడించింది. 8 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన తరువాత సత్యంబాబు విడుదల అయ్యారు. దీంతో అయేషా మీరా హత్య కేసులో అసలు నిందితులకు శిక్ష పడలేదని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.