వైసీపీ ఎంపీ భర్తపై క్రిమినల్ కేసు…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డాక్టర్ కె. సత్యవతి భర్తపై విశాఖ జిల్లా అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా పేదలకు పంచే బియ్యం లారీని ఎంపీ భర్త విష్ణుమూర్తి ఆధ్వర్యంలో నడుస్తున్న వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిల్వ ఉంచారు. దీని మీద కేసు నమోదు చేశారు. ఎంపీ భర్త అక్రమంగా బియ్యం లారీని తమ ఆధీనంలో ఉంచుకున్నారంటూ ఫిర్యాదు రావడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ప్రాథమిక విచారణ జరిపారు. కోటా బియ్యం కావాలంటూ తమ శాఖకు వారి నుంచి ఎలాంటి వినతి రాలేదని, అలాంటప్పుడు వారి వద్ద అక్రమంగా లారీ ఉన్నట్టేనని, ఇది చట్ట విరుద్ధమని తేల్చారు. అక్రమంగా లారీ సరుకుని నిల్వఉంచినందుకు కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టారు. డీలర్‌ను సస్పెండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నట్టు జాయింట్ కలెక్టర్ చెప్పారు.
అంతకు ముందు ఎంపీ భర్తకు చెందిన ట్రస్ట్ కార్యాలయంలో కోటా బియ్యం లారీ ఉందంటూ కొందరు సివిల్ సప్లై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్ అక్కడకు వెళ్లి విచారించారు. రిలీజ్ ఆర్డర్ లేకుండా బయటకు వచ్చిన 500 కేజీల బియ్యాన్ని లారీలో ఎక్కించారు. అయితే, ఎంపీ పుట్టిన రోజు (ఏప్రిల్ 30)న పేదలకు పంచేందుకు బియ్యాన్ని కొనుగోలు చేయాలని సత్యవతి చెప్పారు. అయితే, ఎంపీ వద్ద పనిచేసే వారు బియ్యాన్ని బయట కొనాల్సింది పోయి ఇలా కోటా బియ్యాన్నే తరలించారని ఆరోపణలు వచ్చాయి. తన భార్యకు, వివేకానంద ట్రస్ట్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ భర్త విష్ణుమూర్తి తెలిపారు.