మహిళా విలేకరికి ‘లైవ్‌’లో ముద్దు!

మాస్కో: ప్రపంచకప్‌ సాకర్‌ మ్యాచ్‌ల కవరేజీలో ఉన్న మహిళా రిపోర్టర్‌ను ప్రత్యక్ష ప్రసారం సమయంలోనే ఒక ఆకతాయి ముద్దుపెట్టి వెళ్లిపోయాడు. ఈ నెల 15న మర్డోవియా అరెనా స్టేడియం వద్ద ఈ ఘటన జరిగింది. ‘డెట్‌స్చే వెల్లె’ న్యూస్‌ చానెల్‌లో కొలంబియాకు చెందిన జులియెత్‌ గాంజలెజ్‌ థెరాన్‌ అనే అమ్మాయి పనిచేస్తుంది. లైవ్‌ కవరేజీలో నిమగ్నమైన ఆమెను ఒక ఆకతాయి ఛాతీ భాగంలో తగులుతూ చెంపపై ముద్దుపెట్టి వెళ్లిపోయాడు.

తనకు ఎదురైన ఈ చేదు అనుభవానికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. తనపై జరిగిన లైంగిక వేధింపులపై వాపోయింది. ‘ప్రత్యక్ష ప్రసారం కోసం నేను రెండు గంటల పాటు కసరత్తు చేశాను. లైవ్‌లో ఎలాంటి అంతరాయం కలగకూడదని ఇలా ప్రవర్తించినప్పటికీ నా పని (న్యూస్‌ ప్రజంటేషన్‌) పూర్తి చేశాకే ఆకతాయి కోసం వెతికాను. కానీ ఆ వ్యక్తిని నేను కనుక్కోలేకపోయాను’ అని గాంజలెజ్‌ థెరాన్‌ అందులో పేర్కొంది.

Comments (0)
Add Comment