Leading News Portal in Telugu

Group 1 and Group 2 Notification: త్వరలో గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు..


Group 1 and Group 2 Notification: ఈ రోజు ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పరీక్షా ఫలితాలను ప్రకటించారు.. గ్రూప్‌-1లో ఖాళీల 110 పోస్టులకుగానూ తుది ఫలితాలు వెల్లడించారు.. గ్రూప్‌ -1 నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి ఫలితాలు ప్రకటించే వరకు పూర్తిస్థాయిలో పారదర్శకత పాటించినట్టు ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతం సవాంగ్‌ పేర్కొన్నారు.. మొత్తంగా గ్రూప్ వన్ పోస్టుల సంఖ్య 111 ఉండగా.. ఒక పోస్ట్ స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తాం.. ఇప్పుడు 110 పోస్టుల ఫలితాలు ప్రకటిస్తున్నాం అని తెలిపారు. మరోవైపు.. మరిన్ని పోస్టుల భర్తీకి సిద్ధం అవుతోంది ఏపీపీఎస్సీ.. త్వరలోనే మరో గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌తో పాటు.. గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయనున్నట్టు గౌతం సవాంగ్‌ వెల్లడించారు.

2019 నుంచి ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ నుంచి 64 నోటిఫికేషన్లు విడుదల చేశామని తెలిపారు గౌతం సవాంగ్.. త్వరలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నాం.. సిలబస్ లో కీలక మార్పులు తీసుకుని రానున్నాం అన్నారు. 17 ఏళ్ల తర్వాత మొదటి సారి యూనివర్సిటీల్లో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకం చేయనున్నాం అని వెల్లడించారు. చివరిసారి 2006లో నియామకాలు చేశారని గుర్తుచేశారు. వచ్చే నెలలో మరో గ్రూప్ 1 నోటిఫికేషన్ రానుందని ప్రకటించారు ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతం సవాంగ్‌. అంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతున్నవారు.. మళ్లీ పుస్తకాలను తిప్పేయాల్సిన సమయం వచ్చేసింది.. గ్రూప్‌ 1 తో పాటు గ్రూప్‌ 2కు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా తక్కువ సమయంలోనే రాబోతున్నాయి.