CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనుల పురోగతిని ఈ సందర్భంగా సీఎంకు వివరించారు అధికారులు.. రామాయపట్నం పోర్టులో దాదాపుగా సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్ వాటర్ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. ఇక, రామాయపట్నం పోర్టు మొత్తం నిర్మాణ వ్యయం అంచనా రూ. 3,736 కోట్లుగా ఉందన్నారు. తొలిదశలో నిర్మిస్తున్న ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలపై కూడా దృష్టి సారించారు సీఎం వైఎస్ జగన్.. అయితే, ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఎంఎస్‌ఎంఈల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్.. ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తులకు మార్కెటింగ్‌పై ఫోకస్ పెట్టాలన్న ఆయన.. ఇతర దేశాల్లో ఎంఎస్‌ఎంఈల నిర్వహణ, నాణ్యమైన ఉత్పాదనల విధానాలను ఇక్కడ కూడా అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు.. వినూత్న ఉత్పాదనలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీపై దృష్టి కేంద్రీకరించాలని.. అలాగే ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ సౌకర్యంతో పాటు, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించగలగాలని స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్.. ఎంఎస్‌ఎంఈలను క్లస్టర్లగా విభజిస్తే మౌలిక సదుపాయాల వృద్ధి వంటి అంశాలపై దృష్టి పెట్టేందుకు వీలు ఉంటుంది.. హ్యాండ్‌లూమ్స్, గ్రానైట్ రంగాల్లో ఎంఎంస్‌ఎంఈలను క్లస్టర్లుగా విభజించాలి.. పర్యావరణ హిత విధానాలకు ఎంఎస్‌ఎంఈల్లో పెద్దపీట వేయాలని ఆదేశించారు సీఎం వైఎస్ జగన్. ఇక, తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ జవహర్‌రెడ్డి సహా.. ఆ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.