Leading News Portal in Telugu

Pawan Kalyan: ఏపీలో పొత్తులు.. ఎన్డీఏపై పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. టార్గెట్‌ అది ఒక్కటే..!


Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులపై చర్చలు సాగుతూనే ఉన్నాయి.. టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయా..? లేదా బీజేపీ కూడా వారితో చేతులు కలుపుతుందా? అనే చర్చ సాగుతూనే ఉంది.. అయితే, మరోసారి ఎన్నికల పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. పొత్తులపై చర్చలు జరుగుతూనే ఉన్నాయన్న ఆయన.. కొత్త ప్రభుత్వం జనసేన – బీజేపీ నా? లేక జనసేన – టీడీపీ – బీజేపీ ప్రభుత్వమా? ఏదైనా సరే ప్రస్తుత ప్రభుత్వాన్ని మార్చే విధంగా పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు. ఇక, భవిష్యత్ లో ఎన్డీఏ ఎలా ఉంటుందన్నది కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని మరోసారి క్లారిటీ ఇచ్చిన పవన్‌.. కానీ, ప్రజల మద్దతు పూర్తిగా ఉంటే ఓకే అన్నారు. ఎన్నికలు అయ్యాక శాసనసభ్యుల నిర్ణయం మేరకు ముఖ్యమంత్రిపై నిర్ణయం ఉంటుంది.. ఈ ప్రాసెస్ లో ఓటు చీలకూడదన్నది నా ఉద్దేశంగా తెలిపారు.

టీడీపీ హయాంలో తప్పులు జరిగి ఉంటే చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు పవన్‌ కల్యాణ్.. జనసేన సంస్థాగత నిర్మాణం బలహీనంగా ఉందని చెప్పడానికి వాళ్లేవరు? అని ప్రశ్నించారు. ఇక, స్టీల్ ప్లాంట్ పై నిరంతరం ఒత్తిడితో సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నేను సున్నితంగా కనిపించవచ్చు.. కానీ, ప్రజల కోసం వ్యక్తిగత దూషణలను భరించడానికి సిద్ధమే అన్నారు. మరోవైపు.. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా మా ప్రభుత్వ ఆలోచన చేస్తుందని తెలిపారు. పాలసీ నచ్చకపోతే ప్రధాని గురించి మాట్లాడినోడిని.. టీడీపీ హయాంలో జరిగిన వైఫల్యాలపై కూడా చర్చించానని చెప్పుకొచ్చారు. సీఎం పదవిపై నా ఆసక్తిని ఇప్పటికే చెప్పాను.. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి.. టీడీపీ , జనసేన ప్రభుత్వమా.? బీజేపీతో కలిసి వెళ్లాడమా..? ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయన్నారు. అయితే, కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇప్పుడు పాలకులను బాధ్యులుని చేస్తాం అని వార్నింగ్‌ ఇచ్చారు. వైసీపీ వాళ్లు డబ్బుతో బలిసిపోతుంటే.. సామాన్యుడు బ్రతకడానికే ఇబ్బంది పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు పవన్‌.

మరోవైపు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పవన్‌.. రాష్ట్రంలో క్రిమినాలిటీని లీగలైజ్ చేసేశారన్న ఆయన.. బ్రిటీష్ కాలం కంటే దారుణంగా.. విభజించి పాలించే విధానం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అనుసరిస్తున్నారని విమర్శించారు. రాయలసీమలో దోపిడీ సాధ్యం కానందునే ఉత్తరాంధ్రపై పడ్డారంటూ ఆరోపణలు గుప్పించారు. ప్రతీ పనికి రేట్ కార్డులు పెట్టి వైసీపీ నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. మన్యంలో సహజవనరులు దోపిడీపై పోరాటం చేస్తామని ప్రకటించారు. బీ ఫర్ బాంబ్.. ఎస్ ఫర్ స్కామ్ అని జగన్ పిల్లలతో రాయిస్తున్నారు.. కానీ, చదువు కోవడానికి స్కూళ్లు లేవని విద్యా వ్యవస్థపై విమర్శలు చేశారు. వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నా నాణ్యమైన విద్య లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. లిక్కర్, గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడ్డ వారికి డీ ఆడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక, ర్రాష్టాన్ని పన్నుల మాయం చేసేశారు.. గ్రీన్ ట్యాక్స్ పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.