Pawan Kalyan and Chandrababu: మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై సంచలన ఆరోపణలు చేశారు ప్రభుత్వ సలహాదారు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బేరం పెంచుకోవడాని పవన్ కల్యాణ్ రోజుకో మాట మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ ఓటు చీలకూడదని అంటేనే ఎంత మందితో అయినా పొత్తు పెట్టుకుంటాడని అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ విధానం చూస్తేనే వెనుక చంద్రబాబు ఉన్నాడని స్పష్టం అవుతుందన్న ఆయన.. చంద్రబాబు ఎలా చెబితే పవన్ కల్యాణ్ అలానే చేస్తాడు.. విడిగా పోటీ చేసినా, కలిసి పోటీ చేసినా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసే ఉన్నారు.. చెప్పేది చంద్రబాబు అయితే.. ఫాలో అయ్యేది పవన్ కల్యాణ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇక, విశాఖపట్నం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్ పాలనలో ప్రశాంతంగా ఉందన్నారు సజ్జల.. చంద్రబాబు హయాంలోనే ఘోరాలు జరిగాయని విమర్శించారు. విశాఖకు రాజధాని రాకుండా చేయాలని పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు.. టీడీపీ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు ఎంత ఉండేవో అందరికి తెలుసన్న ఆయన.. చంద్రబాబు మాట్లాడే మాటలు విజన్ లా ఉన్నాయా..? అని దుయ్యబట్టారు. చిన్న పిల్లలు మాట్లాడితే పెద్దవాళ్ళు నవ్వుకున్నట్లు ఉన్నాయి చంద్రబాబు మాటలు అంటూ సెటైర్లు వేసిన ఆయన.. టార్చ్ లైట్ టెక్నాలజీని తానే కనిపెట్టాను అంటాడు.. తనని తాను తిట్టుకోవాల్సింది పోయి జగన్ ని తిడుతున్నారు అంటూ కౌంటర్ ఎటాక్‌కు దిగారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. కాగా, విశాఖలో మరోసారి ఎన్నికల పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. కొత్త ప్రభుత్వం జనసేన – బీజేపీనా? లేక జనసేన – టీడీపీ – బీజేపీ ప్రభుత్వమా? ఏదైనా సరే ప్రస్తుత ప్రభుత్వాన్ని మార్చే విధంగా పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు. ఇక, భవిష్యత్ లో ఎన్డీఏ ఎలా ఉంటుందన్నది కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ఇక, కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇప్పుడు పాలకులను బాధ్యులుని చేస్తాం అనిపవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చిన విషయం విదితమే.