Chandrababu: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీవి దొంగ సర్వేలు అంటూ విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన మహిళా ప్రగతి కోసం ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీవి దొంగ సర్వేలు.. వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలుపు కలగా జోస్యం చెప్పారు. వైసీపీకి 14 శాతం ఓట్లు కూడా రావన్న ఆయన.. మహిళలు మోసకారి జగన్‌ను సాగనంపండి అంటూ పిలుపునిచ్చారు. మహిళా సాధికారతే ధ్యేయంగా తెలుగుదేశం ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిందని తెలిపారు. ప్రతీ ఇంట్లో మహిళలే.. ఆర్థిక మంత్రి.. సూపర్ సిక్స్ లో భాగంగా మహాశక్తికి మొదటిగా ప్రాధాన్యత కల్పించామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు.
సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు చంద్రబాబు.. 1996 తుపాను సమయంలో కోనసీమ ప్రాంతం విచ్ఛిన్నమయితే.. నా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాజమహేంద్రవరం కేంద్రంగా సెక్రటేరియట్ ఏర్పాటు చేసి సమస్యలను పూర్తిగా పరిష్కరించామని గుర్తుచేసుకున్నారు. మా తల్లి పడిన కట్టెల పొయ్యి కష్టాన్ని చూసి తట్టుకోలేక ఆడ బిడ్డలను ఆదుకునే విధంగా దీపం పథకాన్ని ప్రారంభించానన్న ఆయన.. వైకుంఠపాళీ మాదిరిగా మారింది ప్రస్తుత పరిస్థితి.. నేను అభివృద్ధి చేస్తే.. వాటిని వీళ్ళు నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఆక్వా రైతాంగాన్ని వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్ పై పెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలు ఓపిక పట్టండి ఆక్వా రైతాంగాన్ని ఆదుకుంటామని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు.