Leading News Portal in Telugu

Andhra Pradesh: గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం.. రేపు 2,62,169 మంది ఖాతాల్లో నగదు జమ..


Andhra Pradesh: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది.. అర్హులకు ఫలాలు అందిస్తోంది.. పథకాల అమలులో.. కులం, మతం, పార్టీ చూడకుండా అందిస్తామని ఎన్నోసార్లు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, అర్హతలు ఉండి కూడా ప్రభుత్వ పథకాలు అందనివారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.. దీంతో, వారిని దృష్టిలో పెట్టుకుని కీలకం నిర్ణయం తీసుకున్నారు సీఎం.. అర్హులై సంక్షేమ పథకాలు అందని రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు.. ఇప్పటికే అర్హలై సంక్షేమ ఫలాలు అందని 3,39,096 మందిని గుర్తించి రూ.137 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.. మరోసారి వారికి సహాయం అందించేందుకు రెడీ అయ్యారు..

అర్హులై ఉండి వివిధ కారణాల వల్ల పథకాలు అందని వారికి రేపు అనగా ఈ నెల 24వ తేదీన వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయనున్నారు.. డిసెంబర్ 2022- జూలై 2023 మధ్య కాలానికి ఇది వర్తింపజేయనున్నారు.. ఈ సారి అర్హులై ఉండి వివిధ కారణాలతో పథకాలు అందని 2,62,169 మందికి ఆర్ధిక ప్రయోజనం చేకూర్చేందుకు సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. మొత్తంగా 2,62,169 మంది బ్యాంకు ఖాతాల్లో 216.34 కోట్ల రూపాయలను రేపు వర్చువల్ గా జమ చేయనున్నారు సీఎం జగన్‌.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరగనున్న కార్యక్రమంలో పాల్గొని.. బటన్‌ నొక్కి సంబంధితుల ఖాతాల్లో సొమ్ములు జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగ్మోహన్‌రెడ్డి.