Leading News Portal in Telugu

CM YS Jagan: నామినేట్ పోస్టుల ఎంపిక కసరత్తుకు బ్రేక్..? పాతవారే కొనసాగింపు..!


CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో నామినేట్ పోస్టుల ఎంపిక కసరత్తుకు బ్రేక్‌ వేసింది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. రాష్ట్రంలోని 130కి పైగా కార్పొరేషన్ల ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియపై స్పష్టతకు వచ్చింది వైసీపీ సర్కార్.. ఒకటీ రెండు చోట్ల మినహా.. దాదాపుగా అందరికీ కొనసాగింపు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.. అయితే, గత నెలలో పలు కార్పొరేషన్ పాలకమండళ్ల పదవీ కాలం ముగిసిపోయింది.. దీంతో.. అదే స్థానాల్లో ఛైర్మన్లు, డైరెక్టర్లును కొనసాగించే అవకాశం ఉంది.. 56 బీసీ కార్పొరేషన్ల విషయంలోనూ ఇదే విధానాన్ని అనుసరించింది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.

అయితే, అధికార వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో మరోమారు పదవుల పండుగ ప్రారంభం అవుతుందని అంతా అనుకున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు నామినేటెడ్‌ పదవుల పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయానికి వచ్చారని ప్రచారం సాగింది.. తాను సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2021 జులై 17న 137 నామినేటెడ్‌ పదవులను ఒకేసారి భర్తీ చేశారు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు వీరందరి పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే మళ్లీ ఇదే తరహాలో పదవులను ఒకేసారి భర్తీ చేయాలని, అదికూడా సామాజిక న్యాయం పాటిస్తూ ఎంపికలు ఉండాలని డిమాండ్లు కూడా వినిపించాయి.. కానీ, అనూహ్యంగా పాతవారినే కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారట.. దాంతో, నామినేట్‌ పోస్టుల ఎంపిక కసరత్తుకు బ్రేక్‌ పడినట్టుగా తెలుస్తోంది.