Sajjala Ramakrishna Reddy: టక్కుటమార విద్యల్లో చంద్రబాబు పీహెచ్డీ చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. వైఎస్ జగన్ దీనికి పూర్తి విరుద్ధం అన్నారు. నిజాయితీగా రాజకీయం చేయటమే జగన్ కు వచ్చు.. 60 లక్షల ఓట్లు ఎవరివో తెలియని పరిస్థితి ఉంది.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళాలని మేం భావించాం.. ఈ విషయం జగన్ చెప్పిన వెంటనే చంద్రబాబులో వణుకు మొదలైందని విమర్శించారు. టీడీపీ మా సానుభూతి ఓటర్లను పెద్ద ఎత్తున తీయించిందని ఆరోపించిన ఆయన.. సున్నా డోర్ నెంబర్ తో అనేక ఓట్లు ఉన్నాయి.. ఓకే ఇంటి నెంబర్ పై 700 ఓట్లు ఉన్నాయి.. ఇవన్నీ మేం బయటకు తీస్తున్నాం.. ఉరవకొండలో ఓట్ల రద్దును ఎన్నికల సంఘం తప్పు పట్టలేదు.. రద్దు ప్రక్రియను తప్పు బట్టింది.. దీనికి ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? అని ప్రశ్నించారు.
2015, 2016, 2017 లో 50 లక్షలకు పైగా ఓట్లను తీయించాం.. సేవామిత్రా అనే యాప్ ద్వారా సేకరించిన సమాచారాన్ని బ్లూ ఫ్రాగ్ అనే ప్రైవేటు సంస్థకు టీడీపీ ప్రభుత్వం అప్పగించింది.. బ్లూ ఫ్రాగ్ కు, ఐటీ గ్రిడ్ కు మధ్య సంబంధం ఉంది అని ఆరోపించారు సజ్జల.. అక్కడి నుంచి ఓటర్ను గుర్తించే ప్రక్రియ మొదలు పెట్టారన్న ఆయన.. ఎవరు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, ఏ టీవీ ఛానెల్ చూస్తారు వంటి మొత్తం సమాచారం సేకరించారిని విమర్శించారు. మా పార్టీ ఎంపీలు కూడా ఎన్నికల సంఘానికి వెళ్లి ఫిర్యాదు చేస్తారని పేర్కొన్నారు. దొంగ ఓట్లను పూర్తిగా తీసేయమని అడుగుతామని తెలిపారు. ఇక, చంద్రబాబు ఏజెంట్లు అందరూ ఆర్కెస్ట్రా లా మాట్లాడతారు అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ కూడా అధికారంలోకి దొంగ ఓట్లతో వచ్చిందా? అని ప్రశ్నించారు. దొంగ ఓట్లను తీయించలేని పరిస్థితిలో ఈసీ ఉందని బండి సంజయ్ చెప్పదలుచుకున్నారా? అని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి.
ఓటర్ల జాబితాలో అవకతవకల జరుగుతున్నాయని టీడీపీ, వాళ్ల మీడియా ఆరోపిస్తోంది.. ఉరవకొండలో ఓట్ల తొలగింపులో సరైన విధానాన్ని పాటించలేదనే కారణంతో ఇద్దరు అధికారులను తొలగించారని తెలిపారు సజ్జల..అదేదో పెద్ద విషయం అన్నట్లు చిత్రీకరిస్తున్నారు.. దొంగే దొంగ అన్నట్లు ఉంది. పతివ్రత ఆరోపణల్లా ఉన్నాయి అంటూ ఎద్దేవా చేశారు. ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారనే అనుమానాలు ఎవరికైనా కలుగుతాయన్న ఆయన.. టీడీపీ గోబెల్స్ ప్రచారాన్ని ఖండించకపోతే నిజం అని నమ్మే అవకాశం ఉందన్నారు. అసలు బాధితులం మేమే.. మాకు వేరే విద్యలు రావు.. గోడలు దూకటం, అడ్డదారులు వేయటం టీడీపీకి అలవాటు.. టక్కుటమార విద్యల్లో చంద్రబాబు పీహెచ్డీ చేశారు.. జగన్ దీనికి పూర్తి విరుద్ధం అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.