ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓట్ల తొలగింపుల ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ విపక్షాల ఓట్లను తొలగించేందుకు భారీగా ఫామ్ 7ను వాడి ఫిర్యాదాలు చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హస్తినకు ఓటర్ జాబితాలో అవకతవకల ఎపిసోడ్ చేరుకుంది. ఈ నెల 28న పోటాపోటీగా టీడీపీ, వైసీపీ కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్టీవీతో ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో సేవామిత్రా యాప్ ద్వారా ఓటర్ల సమాచారం సేకరించారని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ సానుభూతిపరుల ఓట్లను పెద్ద ఎత్తున తొలిగించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు హయాంలోనే ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, ఇప్పుడు వాళ్ళే ఏ ముఖం పెట్టుకుని ఈసి దగ్గరకు వెళతారు?? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లకు సంబంధించిన సమాచారాన్ని ఈసీ దృష్టికి తీసుకుని వెళతామని ఆయన అన్నారు.
సంక్షేమ పథకాలను 90 శాతం ప్రజలకు అందించిన మాకు ప్రజా మద్దతు ఉందని ఆయన తెలిపారు. దొంగ ఓట్లతో 151 స్థానాలు సాధించటం సాధ్యం అవుతుందా?? అని ఆయన అన్నారు. అయితే.. దుట్టా రామచంద్ర రావు మా పార్టీలో సీనియర్ నేత అని ఎంపీ బాలశౌరి వ్యాఖ్యానించారు. వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. దుట్టా, నేను తరచూ సమావేశం అవుతూనే ఉంటామని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. ఇవాళ్టి సమావేశాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని, దుట్టా పార్టీ మనిషి, పార్టీకి నష్టం కలిగించే పనులు చేయరని ఆయన అన్నారు. గన్నవరం నియోజకవర్గంలో పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా పని చేస్తారని, సీఎం కూడా పిలిచి మాట్లాడారు… చిన్న చిన్న విబేధాలు సర్దుకుంటాయని ఎంపీ బాలశౌరి అన్నారు.