ఏపీలోని పేద విద్యార్ధులకు చదువు కోసం అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఉన్నత విద్య అభ్యసించే వారికి ఆర్ధికసాయం చేస్తూ అండగా నిలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఏడాదిలో జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన కింద డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ క్రమంలోనే.. తాజాగా ఏపీలోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపు జగనన్న విద్యా దీవెన పథకం నిధులను విద్యార్థుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జగనన్న విద్యా దీవెన గత ఏడాది మూడవ క్వార్టర్ అమౌంట్ కి సంబంధించి రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాలో నగదును బటన్ నొక్క జమ చేయనున్నారు. చిత్తూరు జిల్లా నగరి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేపు ఉదయం 8.30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరి నగరి చేరుకుంటారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో ప్రసంగించి జగనన్న విద్యా దీవెన గత ఏడాది మూడవ క్వార్టర్ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంటును తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు సీఎం జగన్.
ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ ఏడాదికి సంబంధించిన నగదును నగరిలో జరిగే బహిరంగ సభలో జగన్ విడుదల చేయనున్నారు. మంత్రి రోజా సొంత నియోజకవర్గం నగరిలో సభ జరుగుతుండటంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.