Leading News Portal in Telugu

CPI Narayana : బీజేపీనే దేశంలో అల్లర్లకు మతతత్వ ఆందోళనలకు ఆద్యం పోసింది


దేశంలో మోడీ, రాష్ట్రంలో జగన్ చేతులలో నుండి రాష్ట్రాన్ని కాపాడాలని సీపీఐ ప్రయత్నం చేస్తుందన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్రిమినల్ ఆలోచనలు ఉన్న అమిత్ షా వల్లే మణిపూర్ లాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. మణిపూర్ లాంటి అల్లర్ల లను అడ్డుపెట్టుకొని మతం చాటున అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు. బీజేపీనే దేశం లో అల్లర్లకు మతతత్వ ఆందోళనలకు ఆద్యం పోసిందని సీపీఐ నారాయణ ధ్వజమెత్తారు.

నిన్న మొన్నటి వరకు మోడీపై మొరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు బీజేపీ అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడేందుకు కేంద్రానికి జగన్ లొంగిపోయాడని, కేసీఆర్‌ కూతుర్ని లిక్కర్ స్కాం నుంచి బయటపడేసేందుకు బీజేపీ తొత్తుగా మారాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ జగన్ డబల్ ఇంజన్ పాత్ర పోషిస్తున్నారని, మోడీకి దత్తపుత్రుడుగా జగన్ కొనసాగుతున్నాడన్నారు. జగన్ పైకి వైసీపీ ముద్ర లోపల మాత్రం బీజేపీ ముద్రగా పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వైసీపీ దేశం లో బీజేపీ పాలన పోవాలని సీపీఐగా కోరుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఎవరి పాలన రావాలని కోరుకుంటున్నారో ప్రజలు నిర్ణయిస్తారని, ప్రస్తుతానికి పవన్, బీజేపీతో కలిసి అంట కాగుతున్నాడని, పవన్ ఎన్నికల సమయంలో బీజేపీతో ఉంటాడా లేదా అన్నది ప్రశ్నార్థకమే అని ఆయన అన్నారు.