Leading News Portal in Telugu

Undavalli Arun Kumar: ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ కమ్యూనిటీ మంత్రిగా లేనిది ఈ విడతలోనే..!


Undavalli Arun Kumar: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీనియర్‌ పొలిటీషియన్‌, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌.. విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, శాసన సభలో ఎవరెవరు? పుస్తక సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి పుస్తకావిష్కరణ చేశారు.. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ.. ఎవరు దేనికి అర్హులో అదే వారికి వస్తుందన్నారు. అయితే, కమ్మవారు మంత్రిగా లేనిది ఈ విడతలోనే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. 1952 నుంచి కమ్మ, రెడ్డి ఆధిపత్య పోరు ఉందన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీలో కులాల సమతౌల్యం ఉండేది.. ఇక, టీడీపీలో కమ్మవారికి అవకాశాలు ఎక్కువగా ఉండేవని గుర్తుచేశారు ఉండవల్లి అరుణ్‌కుమార్‌.

ఈ పుస్తకం చదివిన వారు నియోజకవర్గాల వారీగా కుల ప్రయోజనాలు తెలుస్తాయి తెలిపారు ఉండవల్లి.. మానసిక సెంటిమెంట్ వలనే బ్రాహ్మణ వ్యతిరేకత వచ్చిందని.. ఏపీలో యాంటీ బ్రాహ్మిన్ మూమెంట్‌ తెచ్చింది త్రిపురనేని రామస్వామి చౌదరి అన్నారు. ఓటును వెయ్యికి, రెండు వేలకి అమ్మేసుకుంటున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. అధికారం కోసమే రాజకీయమా..? అని ప్రశ్నించారు. చిరంజీవికి 16 శాతం ఓట్లు వచ్చాయి.. దేశంలోనే అత్యధిక ఓట్లు.. అయినా కాంగ్రెస్ పార్టీలో కలిపేశారని పేర్కొన్నారు. ఇక, ప్రపంచంలో భారతదేశ యువత లేని దేశం లేదన్న ఆయన.. ఏమైనా చేయగలిగిన ఆళ్లుండి చేయలేకపోతున్నాం అన్నారు.

మరోవైపు.. ఎన్నికల్లో కులం ఆలోచిస్తే దెబ్బతినేదే ఎక్కువ ఉంటుందన్నారు ఉండవల్లి.. రెండే పార్టీలు ఉండాలి అనేది పోవాలంటే అందరికీ కనువిప్పు కలగాలన్నారు. ఇక, ఏపీలో టీడీపీ, బీజేపీ ఒకవేళ కలుస్తాయేమో.. అందుకే కలిసారేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.. ఎన్టీఆర్‌పై వంద రూపాయల కాయిన్ ప్రారంభించడం మంచిదే.. కానీ, లక్ష్మీపార్వతిని పిలవకపోవడం కరెక్ట్ కాదన్నారు.. లక్ష్మీపార్వతి వల్లే బ్రతికానని చివరి రోజుల్లో రామారావు అన్నారని గుర్తుచేశారు. అయితే, పొలిటికల్ గా పొత్తులు సహజం.. వాటిపై మరోసారి మాట్లాడుతానన్నారు ఉండవల్లి అరుణుకుమార్‌.

ఇక, మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. శాసనసభలో మాట్లాడటం ఈనాటి శాసనసభ్యులకు తెలీటం లేదన్నారు.. స్పీకర్లే శాసన సభ భాషను మరిచి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. శాసనసభల్లో బూతులు మాట్లాడితేనే చప్పట్లు కొడుతున్నారు.. చప్పట్ల కోసం ఆ భాష మాట్లాడలేక శాసనసభకు దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. శాసనసభలో ఎప్పుడు ఎలా ఉంది అనేది రాసిన మురళిని అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు మండలి బుద్ధప్రసాద్.