Leading News Portal in Telugu

KA Paul: నిరవధిక నిరాహార దీక్షకు దిన కేఏ పాల్‌..


KA Paul: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కాకుండా.. తన ప్రాణాలను సైతం విడిచేందుకు సిద్ధం అంటున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. స్టీల్ ప్లాంట్ ను అమ్మబోమని కేంద్రం అధికార ప్రకటన చేయాలంటూ ముందుగానే డెడ్‌లైన్‌ విధించారు పాల్.. స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో వెనక్కి తగ్గకపోతే సోమవారం నుంచి ఆమరణనిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగా ఈరోజు నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు కేఏ పాల్.. వైజాగ్‌ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలనే డిమాండ్‌తో పాల్ కన్వెన్షన్ సెంటర్‌లో దీక్షను మొదలుపెట్టారు.. ఇక, రానున్న ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ విశాఖ నుంచి పోటీ చేస్తుందని ప్రకటించిన ఆయన.. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు పేర్కొన్నారు.. ప్రజాశాంతి పార్టీతో మిగిలిన రాజకీయ పార్టీలు కలిసి వస్తే.. ఉక్కు పరిశ్రమను కాపాడటం పెద్ద కష్టం కాదంటున్నారు కేఏ పాల్‌. ఇక, ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో.. ‘ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు, విశాఖపట్నం పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ కేఏ పాల్‌ ఆమరణ నిరాహారదీక్ష” అంటూ రాసుకొచ్చారు.

మరోవైపు.. కేంద్రం మన రాష్ట్రానికి ఏమీచేయకుండా మొండి చేయి చూపించిందని ఇప్పటికే ఆరోపించారు పాల్.. మనం కట్టిన పన్నులను గుజారత్ కు తరలిస్తున్నారు.. ఒక్క స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటే మన రాష్ట్రానికి ఉన్న అప్పులన్నీ తీరిపోతాయన్నారు. నాకు అనుమతిస్తే 4000 కోట్ల రూపాయలు నేను సమకూర్చుతానని ప్రకటించిన విషయం విదితమే.. ఇక, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌.. నరేంద్ర మోడీతో కలిసి వెళ్తానంటున్నారు.. పవన్ ఎవరు ప్యాకేజిస్తే వాళ్లతో వెళ్తున్నారంటూ అనేకమంది విమర్శలు చేస్తున్నారు. కానీ, పవన్‌ నాతో చేయి కలిపితే నేను గెలిపిస్తానని పాల్‌ పేర్కొన్న విషయం విదితమే.. నన్ను ఎంపీగా గెలిపిస్తే గంగవరం పోర్టును సీజ్ చేస్తాను అంటూ సంచలన ప్రకటన చేసిన ఆయన.. అదానీపరం కాకుండా ఆపి తెలుగుసత్తా చూపిస్తాను.. ప్రాణం పెట్టడానికి వచ్చాను.. ప్రాణం పోయేలోపు తెలుగువారి సత్తా చూపిస్తాను అంటూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.