విద్యా దీవెన పిల్లల భవిష్యత్తు మార్చబోయే పథకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఉన్నత చదువులకు 100 శాతం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నట్లు చెప్పారు. సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో బటన్ నొక్కి విద్యాదీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ పథకంలో భాగంగా ఏప్రిల్-జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. గత నాలుగేళ్లలో విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు. స్కూళ్ల ను సమూలంగా మార్చివేశామని ఆయన తెలిపారు. విద్యా దీవెన, వసతి దీవెన లో ఎలాంటి కత్తి రింపులు లేకుండా ఇస్తున్నామని సీఎం జగన్ అన్నారు. మూడు సార్లు సీఎం అయిన వ్యక్తి ఒక్క మంచి పని అయినా చేశారా అని ఆయన ప్రశ్నించారు.
ఒక్క హామీ అయినా నేరవెచ్చని వ్యక్తి చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. సొంత బలం… సొంత కొడుకు మీద నమ్మకం లేదు… దత్త పుత్రుడుకి ప్యాకేజీ ఇచ్చి తెచ్చుకుంటాడని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. వీరి మాటలు, భాష చూస్తే ఆశ్చర్యం వేస్తుందన్న సీఎం జగన్.. రెచ్చగొట్టి, గొడవలు సృష్టించి శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పుంగనూరు, అంగల్లు ఘటనలు చూసారని, కారులో తుపాకులు, బీరు బాటిళ్లతో వచ్చారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఆ ఘటనలో 47 మంది పోలీసులు గాయపడ్డారని, ఒక పోలీస్ కన్ను కోల్పోయాడని, పోలీసులు కాల్పులు జరిపితే శవ రాజకీయాలు చేయాలని చూసారన్నారు. ఇప్పుడు ఢిల్లీకి వెళుతున్నాడు… తన హయాంలో దొంగ ఓట్లు నమోదు చేయించి, ఇప్పుడు మనపై ఫిర్యాదు చేయాలని చూస్తున్నాడని సీఎం జగన్ ధ్వజమెత్తారు. ఇదే బడ్జెట్‌తో చంద్రబాబు నాడు పాలించారు. మరి నాడు ఆయన ఎందుకు ఇన్ని పథకాలు ఇవ్వలేదు అని ప్రజలు ఆలోచించాలని ఆయన అన్నారు.