Leading News Portal in Telugu

Roger Binny: గతంలో కంటే వైజాగ్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి: బీసీసీఐ ప్రెసిడెంట్


BCCI President Roger Binny participate in Eco Vizag Beach Walk: గతంలో కంటే వైజాగ్‌లో ఎన్నో మార్పులు వచ్చాయని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్‌ బిన్నీ అన్నారు. ‘ఎకో వైజాగ్ బీచ్ వాక్‌’లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2023లో భాగంగా జీవీఎంసీ, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ఆధ్వర్యంలో మంగళవారం ఎకో వైజాగ్ బీచ్ వాక్‌ నిర్వహించారు. ఉదయం 6 గంటలకు ఆర్కేబీచ్‌ కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు ఈ వాక్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోజర్‌ బిన్నీ, ఏసీఏ ప్రెసిడెంట్‌ పి శరత్‌చంద్రా రెడ్డి, ఏసీఏ సెక్రటరీ ఎస్‌ఆర్‌ గోపీనాథ్‌ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఎకో వైజాగ్ బీచ్ వాక్‌ అనంతరం రోజర్‌ బిన్నీ మాట్లాడుతూ… ‘నేను ఎకోకి పెద్ద ఫ్యాన్. గతంలో కంటే వైజాగ్‌లో అనేక మార్పులు వచ్చాయి. ఎకో వైజాగ్ బీచ్ వాక్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది. నేను ఇప్పటివరకు నా కుటుంబ సభ్యులతో కలిసి 5 వేలు మొక్కలు పంపిణీ చేశా. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉంది’ అని అన్నారు.

మరోవైపు ఏసీఏ 70 వసంతాల వేడుకల్లో రోజర్‌ బిన్నీ మాట్లాడుతూ… ‘దేశంలో క్రికెట్‌కు ఎదురవుతున్న ప్రధాన సమస్యల్లో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ ఒకటి. దీనిని అధిగమించేందుకు అవసరమైన సహకారాన్ని బీసీసీఐ వారికి అందిస్తోంది. దేశంలో క్రికెట్ మౌలిక సదుపాయాలను అభివృద్ది చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నాము. ఏపీఎల్‌, ఐపీఎల్ వంటి టోర్నీలు ఆటగాళ్లకు ఎంతో ఉపకరిస్తున్నాయి. దేశంలో మహిళా క్రికెట్ అభివృద్ధికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాం’ అని తెలిపారు.