Leading News Portal in Telugu

Rayapureddy Prasad: జనసేనకు షాక్‌.. సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన కీలక నేత..!


Rayapureddy Prasad: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో.. ఆంధ్రప్రదేశ్‌లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న జనసేన పార్టీకి షాక్‌ తగిలింది.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు జనసేన నేత రాయపురెడ్డి ప్రసాద్‌ అలియాస్‌ చిన్నా.. వైసీపీ కండువా కప్పి రాయపురెడ్డి ప్రసాద్‌ని పార్టీలోకి ఆహ్వానించారు సీఎం వైఎస్‌ జగన్‌.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ నుంచి జనసేన అభ్యర్ధిగా బరిలోకి దిగిన ప్రసాద్‌.. ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.. ఇక, ఈ రోజు సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు రాయపురెడ్డి ప్రసాద్‌ అలియాస్‌ చిన్నా.. ఈ కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైసీపీ యువజన నేత జక్కంపూడి గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చేసింది.. వారాహి విజయాత్ర పేరుతో ఇప్పటికే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం జిల్లాలో మొత్తం మూడు విడతలుగా వారాహి విజయాత్ర నిర్వహించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. స్థానిక నేతలపై ఆరోపణలు గుప్పిస్తూనే.. సీఎం జగన్‌పై, మంత్రులపై పనుదైన వ్యాఖ్యలు చేశారు.. ఈ సమయంలో మంత్రులు, వైసీపీ నేతలు కూడా జనసేనానిపై ఎదురుదాడికి దిగిన విషయం విదితమే. దీంతో.. ఏపీ పాలిటిక్స్‌ హాట్‌ హాట్‌గా మారిపోయాయి. గోదావరి జిల్లాలపై పవన్‌ కేంద్రీకరించి పనిచేస్తుంటే.. అక్కడే కీలకనేతగా ఉన్న రాయపురెడ్డి.. ఇప్పుడు వైసీపీ చేరడం చర్చగా మారిపోయింది.