Leading News Portal in Telugu

Minister Amarnath: మానవత్వం చాటుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్‌


రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో ఉండి సహాయం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు క్షతగాత్రులకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ సహాయం అందించి వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. అయితే, బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన పినపోలు నాగేశ్వరరావు, అతని తమ్ముని కుమారుడు సంజయ్ బైక్ మీద ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం విశాఖ వైపు వెళ్తున్నారు.

అయితే, మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న వెహికిల్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న అల్యూమినియం రైలింగ్‌ ని ఢీ కొట్టింది.. దీంతో కింద పడటంతో వీరిద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. నాగేశ్వరరావుకు తలతో సహా పలు చోట్ల గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం అయింది. అలాగే సంజయ్ అనే బాలుడు సుమారు 10 సంవత్సరాల వయసు ఉంటుంది. అతడికి కూడా తీవ్ర రక్తస్రావంతో రోడ్డు మీద పడి ఉన్నారు.

ఇదే టైంలో మంత్రి అమర్నాథ్‌ అనకాపల్లి నియోజకవర్గంలో కార్యక్రమాలు ముగించుకుని విశాఖపట్నం వస్తుండగా.. రోడ్డు పక్కన రక్తమోడుతూ కనిపించిన వీరిద్దరిని చూసి.. వాహనం దిగి వెంటనే తన కాన్వాయ్ లో ఉన్న ఒక వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి, పోలీసుల సహాయంతో వారిని లంకెలపాలెం సీహెచ్సీకి తరలించారు. గాయపడిన ఇద్దరికి లంకెలపాలెం సీహెచ్సీలో ప్రాథమిక చికిత్స చేశారు. అక్కడి నుంచి రెండు అంబులెన్స్ లను కూడా ఆసుపత్రికి పంపించి క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంకు పంపించాలని వైద్యాధికారులను మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఆదేశించారు. తీవ్ర గాయాలైన నాగేశ్వరరావు, సంజయ్ ప్రస్తుతం విశాఖ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స తీసుకుంటున్నారు.