వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అనే నినాదంతో కేంద్రం తీసుకుంటున్న చర్యలకు జనసేన మద్దతిస్తోంది అని జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ పై పవన్ కళ్యాణ్ తో కేంద్ర పెద్దలు చర్చించారు.. దీనిపై లోతైన చర్చ జరగాలి.. ప్రజా ధనం ఆదా అవ్వాలి.. పార్లమెంటులో కూడా చర్చ జరిగి.. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరిగితే దేశానికి కూడా మంచి జరుగుతుంది.. జనసేన తరపున ఈ విధానాన్ని సమర్ధిస్తున్నామని నాదేండ్ల అన్నారు. జమిలీ ఎన్నికలపై చర్చ ఎప్పటి నుంచో జరుగుతుంది.. కేంద్రంలో ఉన్న నాయకత్వం దీనిపై బలంగా ముందుకు వెళుతున్నారు.. ఇది మంచి నిర్ణయం.. కాబట్టి మార్పులు చేస్తారని భావిస్తున్నామని మనోహర్ తెలిపారు.
ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. జనసేన సిద్దంగా ఉంది అని నాదేండ్ల మనోహర్ అన్నారు. ఎన్నికల ద్వారా ఏపీలో కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలని భావిస్తున్నాం.. సెప్టెంబర్ లోనే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే వారాహి యాత్రపై మా నాయకులతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తాం.. పొత్తులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పారు.. పరిస్థితులను బట్టి మా విధానాలు మాకుంటాయని అన్నారు. రాష్ట్రానికి మేలు జరిగేలా, ప్రజా ప్రభుత్వం ఏర్పడేలా జనసేన విధానం ఉంటుంది అని నాదేండ్ల మనోహార్ వెల్లడించారు.
రేపు మా అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అని జనసేన పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహార్ అన్నారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు రేపు చేపడతాం.. రాష్ట్ర వ్యాప్తంగా చక్కటి ఆలోచనతో అన్ని నియోజకవర్గాల్లో పవన్ పుట్టినరోజు కార్యక్రమాలు చేస్తున్నాం.. పవన్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులతో సహపంక్తి భోజనాలు చేస్తామని ఆయన తెలిపారు. రెల్లి కార్మికులు ఎంతో కష్టపడి సమాజానికి వారు సేవ చేస్తున్నారు.. వారి కష్టాన్ని గుర్తించి వారికి అండగా ఉంటామని పవన్ గతంలో చెప్పారు.. వారి మధ్య పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరుపుతామని నాదేండ్ల పేర్కొన్నారు. యువతకు స్పూర్తి వంతంగా ఉండేలా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తామన్నారు.