ఈనెల 17న ధర్నా చేసుకునేందుకు సీపీఎస్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. పలు షరతులతో కూడిన అనుమతిని ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది. ఈ ధర్నాలో నల్లబ్యాడ్జీలు ధరించి సీపీఎస్ ఉద్యోగులు నిరసన తెలియజేయనున్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామని మొదటి అసెంబ్లీలో ప్రకటించి మాట్లాడటం మానేసారు అంటూ సీపీఎస్ ఎంప్లాయిస్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఏపీసీపీఎస్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.అప్పల్రాజు మాట్లాడుతూ.. ఈరోజు సీపీఎస్ ఉద్యోగుల పాలిట చీకటి దినం.. అన్యాయమైన గుదిబండ లాంటి సీపీఎస్ తీసుకొచ్చారు అని వ్యాఖ్యనించారు.
సీపీఎస్ కు వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహిస్తున్నామని ఏపీసీపీఎస్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.అప్పల్రాజు అన్నారు. సీపీఎస్ ఉద్యోగులను పలుమార్లు నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేశారు.. అన్ని జిల్లాల్లో సీపీఎస్ ఉద్యోగులపై కేసులు నమోదు చేసారు.. సీపీఎస్ కంటే దారుణమైన జీపీఎస్ తెచ్చారు.. సీపీఎస్ ఆర్డినెన్స్ లో ఏముందో మాకు చెప్పాలి.. జీపీఎస్ పేరుతో మమ్మల్ని మాయ చేయద్దు.. మభ్య పెట్టద్దు అని ఆయన అన్నారు. మా డబ్బులే తీసుకుని మాకు అందులో 50శాతం పెన్షన్ ఇస్తామనడం న్యాయం కాదు.. వృద్ధాప్యంలో మాకు బ్రతకడానికి భరోసా ఇవ్వమంటే అన్యాయం చేస్తున్నారు అని అప్పల్రాజు పేర్కొన్నారు. హైకోర్టు తీర్పులో చెప్పిన విధంగానే మేం నిరసనలు వ్యక్తం చేస్తామని ఏపీసీపీఎస్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అప్పల్రాజు అన్నారు. మాకు సీపీఎస్, జీపీఎస్ వద్దు ఓపీఎస్ మాత్రమే కావాలన్నారు.
దేశంలోని రాష్ట్రాలన్నీ ఓపీఎస్ అమలు చేస్తుంటే జీపీఎస్ ఆదర్శప్రాయంగా ఎలా అవుతుంది అని సీపీఎస్ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు పాలేరు రామాంజనేయ యాదవ్ అన్నారు. మా డబ్బులు తీసుకునే వెసులుబాటు లేదు కనుక సీపీఎస్, జీపీఎస్ ఆప్షన్ ఇస్తున్నారు.. దేశంలో రాష్ట్రాలన్నీ ఒకవైపు మన రాష్ట్రం మాత్రం ఒకవైపు.. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకుండానే ఓపీఎస్ అమలు చేశారు.. సీపీఎస్ ఉద్యోగుల వల్లనే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. 220 వారాలవుతున్నా మాకు న్యాయం జరగలేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. APNGGO సంఘ నాయకులతో జీపీఎస్ బాగుందని చెప్పించడం వెనుక కుట్ర ఉంది.. ఏపీఎన్జీజీఓ సంఘానికి ప్రభుత్వం ఏమైనా ప్రత్యేకంగా హామీ ఇచ్చిందా.. ఏపీఎన్జీజీఓ నాయకులకు ముందుగా పైలట్ ప్రాజెక్టుగా జీపీఎస్ అమలు చేయండి.. వాళ్లు లబ్ధి పొందితే మేం కూడా అంగీకరిస్తాం.. ఓపీఎస్ తీసుకొచ్చేదాకా మా ఉద్యమాలు ఆగవు అంటూ పాలేరు రామాంజనేయ యాదవ్ తెలిపారు.