Cheetas Roaming In Andhra Pradesh : గత కొన్ని రోజులుగా తిరుమలలో చిరుత సంచారం భయాందోళనకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం అధికారులు ఆపరేషన్ చిరుత కూడా చేపట్టి చిరుతల్ని పట్టుకున్నారు. తాజాగా అలిపిరి నడకమార్గం నరశింహస్వామి ఆలయ సమీపంలో చిరుత సంచారాన్ని గుర్తించారు. గతంలో ఇదే ప్రాంతంలో రెండు చిరుతలను అధికారులు ట్రాప్ చేశారు. ఇక నిరంతరాయంగా చిరుతల కదలికలను గుర్తించేలా ఏర్పాట్లు చేసిన అధికారులు ఇప్పటి వరకు నాలుగు చిరుతలను ట్రాప్ చేశారు. అదేవిధంగా నడకమార్గంలో శాశ్వత ప్రాతిపాదికన ట్రాప్ కెమెరాలను టీటీడీ ఏర్పాటు చేసింది.
కేవలం తిరుమలలో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరుతల సంచారం భయాందోళలకు గురిచేస్తోంది. తాజాగా శ్రీశైలంలో చిరుతపులి సంచారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిన్న సాయంత్ర రుద్రాపార్కు సమీపంలోని గోడపై చిరుత కూర్చొని ఉండగా యాత్రికులు సెల్ ఫోన్ లో దానిని చిత్రీకరించారు. దీంతో స్థానిక ప్రజలు భయపడిపోతున్నారు. దీనిపై అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉందని విన్నవిస్తున్నారు. మరోవైపు రామ కుప్పం మండలంలో కూడా చిరుత హల్ చల్ చేసింది. పీఎంకే తాండాలో లేగ దూడపై దాడి చేసి చంపేసింది. తరచూ తమ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని తెలిపిన గ్రామ ప్రజలు.. అక్కడ ఉండాలంటేనే భయంగా ఉందంటూ, చిరుత బెడద నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చిరుతలు సంచారించడంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యి వాటిని పట్టుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే ప్రసిద్ద తిరుమలలో చిరత దాడిలో ఓ చిన్నారి చనిపోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన శ్రీవారి భక్తులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.