Tomato Price Today in Madanapalle Market: గత జూన్, జూలై నెలలో టమోటా ధరలు అమాంతంగా పెరిగిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని రీతిలో ఏకంగా కిలో టమోటా ధర రూ. 200 దాటింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అయితే కిలో టమోటా రూ. 250 వరకు పలికింది. ఆగస్టు 10 వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో సామాన్య ప్రజలు టమోటా జోలికే పోలేదు. ప్రస్తుతం సీన్ మొత్తం మారిపోయింది. కొండెక్కిన టమాటా ధరలు ఈ 20 రోజుల్లో నెలకు దిగొచ్చాయి.
జూలై చివరి వరకు రూ. 200 పలికిన కిలో టమోటా ధర.. ఇప్పుడు రూ. 7కు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మదనపల్లి మార్కెట్లో కిలో టమోటా ధర రూ. 7 పలుకుతోంది. పలు ప్రాంతాల నుంచి టన్నుల కొద్దీ పంట వస్తుండటం, ఇతర ప్రాంతాల నుంచి బయ్యర్లు రాకపోవడంతో.. టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. దాంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. 20 రోజుల క్రితం మదనపల్లి మార్కెట్కు టమోటాలు తీసుకొచ్చి జేబు నిండా డబ్బులు తీసుకెళ్లిన రైతు.. ఇప్పుడు ఖాళీ జేబులతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
పెరిగిన టమోటా ధరలు జూన్, జూలై నెలలో రైతులకు కాసుల వర్షం కురిపించాయి. ఊహకందని ధరలతో కొందరు రైతులను టమోటా కోటీశ్వరులను చేసింది. ఇదే విషయాన్ని రైతులు స్వయంగా చెప్పారు. టమోటాకు ఇంత ధర ఎప్పుడూ లేదని, చాలా డబ్బు సంపాదించామని తెలిపారు. అయితే ఇప్పుడు అదే టమోటా రైతుకు కంటతడి పెట్టిస్తోంది.