Leading News Portal in Telugu

Milind Parande: ఉదయనిధి స్టాలిన్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి..!


Milind Parande: సనాతన ధర్మంపై కామెంట్లు చేసి ఒక్కసారి హిందూ సంఘాలు, వీహెచ్‌పీ నేతలు, బీజేపీకి టార్గెట్‌ అయిపోయారు తమిళనాడు సీఎం కుమారుడు, మంత్రి, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్‌.. ఇక, ఉదయనిధి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు వీహెచ్‌పీ కేంద్రీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే.. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మంపై భయానక వ్యాఖ్యలు చేసిన సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉదయనిధి స్టాలిన్‌ను పదవి నుంచి తొలగించాలన్న ఆయన.. తమిళనాడు ప్రభుత్వం విషయంలో కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అన్నారు.

ఇక, ఉదయనిధి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసును తీసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు మలింద్‌ పరాండే.. మరోవైపు.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుల నియామకంపై స్పందిస్తూ.. టీటీడీ బోర్డులోకి అన్యులను తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నాం అన్నారు. తిరుమల దర్శనం అందరికీ అందేలా సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు. టీటీడీ భక్తుల రక్షణకు చర్యలు తీసుకోవాలి.. స్వయం ప్రతిపత్తి కలిగిన దేవాలయాల నిర్వహణ హిందువులకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. క్రైస్తవ మిషనరీలు, ముస్లింలు మత మార్పిడులు చేయడాన్ని మేం ఆపుతామని ప్రకటించారు. ప్రభుత్వాలు.. దేవాలయాలను కంట్రోల్ చేయడం సరైనది కాదని వార్నింగ్‌ ఇచ్చారు. భజరంగ్ దళ్ శౌర్య యాత్ర చేయబోతున్నాం.. ఏపీలో మతమార్పిడులు ఎక్కువగా జరగడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. విశ్వహిందూ పరిషత్ కు ఇది 60వ సంవత్సరం.. వీహెచ్‌పీని ఈ సంవత్సరం లక్ష స్ధానాలకు వ్యాపింపచేయడం మా ఉద్దేశం అని.. కోటి మందిని వీహెచ్‌పీలోకి తీసుకొస్తాం.. 1058 వ్యవస్ధాపక జిల్లాలుగా భారతదేశాన్ని విభజించామని తెలిపారు వీహెచ్‌పీ కేంద్రీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే.