Leading News Portal in Telugu

Purandeshwari: తెలుగు భాష అంతరించిపోయే దశలో ఉంది


విజయవాడలో మాతృభాషా మహాసభకు పలు రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, కాంగ్రెస్ మీడియా ఇంఛార్జ్ తులసీరెడ్డి, జనసేన అధికార ప్రతినిధి కందుల దుర్గేష్, మాజీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, సీపీఐ నాయకురాలు అక్కినేని వనజ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాతృ భాష మహాసభ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది.

ఈ సందర్భంగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ దినోత్సవం రోజున మాతృభాషా సభ ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విసయం అన్నారు. తెలుగు భాష త్రిలింగం అనే పదం నుంచీ వచ్చింది.. దక్షిణ ఆసియాలో 24 ద్రవిడ భాషల్లో అత్యధిక మంది వాడే భాష తెలుగు.. అత్యంత సుందర లేఖనం కలిగిన భాష కూడా తెలుగేనంటు ఆమె పేర్కొన్నారు.

అయితే, ప్రస్తుతం తెలుగు అంతరించిపోయే దశలో ఉందనే ఆందోళన కలుగుతోంది అని పురంధేశ్వరి అన్నారు. భాష మృతభాషగా మారడం మన సంస్కృతి అంతరించడమే.. మన సంస్కృతి, సాంప్రదాయం తెలుగు సాహిత్యంలో నిక్షిప్తమై ఉన్నాయని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యనించారు. ఎన్టీఆర్ మమ్మల్ని మిషనరీ స్కూలులో చేర్పించారు.. ఆయన మాకు ఒక మాస్టర్ ను పెట్టి మరీ తెలుగు నేర్పించారు.. ఇంగ్లీషు పేరు చెప్పి తెలుగును అగౌరవపరచ కూడదు అని పురంధేశ్వరి చెప్పారు.

కాంగ్రెస్ మీడియా వ్యవహారాల ఇంఛార్జ్ తులసీరెడ్డి మాట్లాడుతూ.. ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో ప్రపంచంలో ఏడవ భాష తెలుగు అన్నారు. మన దేశంలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య నాల్గొవ స్థానంలో ఉందన్నారు. శ్వాస ఆగిపోతే మనిషి చనిపోతాడు.. భాష ఆగిపోతే జాతి చనిపోతుంది.. అలాంటి తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈష్ట్ అని నికోలిస్ అన్నాడు అని తులసీ రెడ్డి చెప్పారు.

సీపీ బ్రౌన్ సైతం తెలుగు భాష నేర్చుకున్నాడు.. తెలుగు మృతభాషగా మిగిలిపోతుందేమో అని భయమేస్తోంది కాంగ్రెస్ నేత తులసీ రెడ్డి అన్నారు. అమ్మ వద్దు మమ్మీ ముద్దు అనే వాతావరణం ప్రస్తుత కాలంలో వస్తోంది.. తెలుగు అక్షరాలు చదవలేని పిల్లలు 8వ తరగతిలో సైతం 2.3శాతం మంది ఉన్నారని అనేక నివేదికలు వస్తున్నాయి.. చైనా భాషనే వాడాలని ఆ దేశం 2010లో చట్టం చేసింది.. మాతృభాష కోసం ఒక దేశం ఆవిర్భవించింది.. అది బంగ్లాదేశ్.. మాతృభాష నాటుకోడి లాంటిది.. పరాయిభాష ఫారం కోడి లాంటిది అని ఆయన పేర్కొన్నారు.