Sajjala Ramakrishna Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబుకు భవిష్యత్ కళ్ళ ముందు కనపడుతోందని.. అడ్డంగా బుక్ అయినట్లు తనకే అర్థం అయినట్లుందని సజ్జల పేర్కొన్నారు. అందుకే గుమ్మడి కాయ దొంగలా భుజాలు తడుముకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలకు చంద్రబాబు అతీతుడు కాదని.. చేసిన అవినీతికి చర్యలు ఎదుర్కోక తప్పదన్నారు. సానుభూతి కోసమే అరెస్టు అంటున్నాడని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
ముడుపులు ఎటు నుంచి ఎలా వెళ్ళిందో 46 పేజీల నోటీసుల్లో ఆధారాలతో సహా బయటపడిందన్నారు. చంద్రబాబు పాపం పండిందని సజ్జల పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపు చేసే ఉద్దేశం అయితే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్టు అయి ఉండే వాడని ఆయన అన్నారు. ఇప్పటికే ఈడీ వంటి ఏజెన్సీలు రంగంలోకి దిగి ఉండాల్సిందన్నారు. ఐటీ నోటీసులు సాధారణం అని పురంధరేశ్వరి చెప్పటం కరెక్ట్ కాదని.. చంద్రబాబును రక్షించే ప్రయత్నమా? తెలియని తనమా? అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఇండియా పేరు మార్చి భారత్ అని పెట్టడం వల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏంటని ప్రశ్నలు గుప్పించారు. ప్రపంచం ఇండియాగా చూస్తుంది.. మనం భారతదేశం అని పిలుస్తాం అని సజ్జల తెలిపారు. రెండు పేర్లు బాగానే ఉంటాయన్నారు. ఈ అంశంపై ఈ స్థాయిలో చర్చ అనవసరమన్నారు.
జమిలి ఎన్నికలు ఆదర్శనీయ అంశమే అయినా ఆచరణలో చాలా ప్రశ్నలు ఉన్నాయని సజ్జల అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య, ఫెడరల్ స్ఫూర్తి దెబ్బ తినకుండా ఎలాంటి ప్రతిపాదనలు కేంద్రం తీసుకుని వస్తుందో చూడాలన్నారు. ఈ రెండు అంశాలపై జగన్ చర్చించి పార్టీ విధానాన్ని వెల్లడిస్తారని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు.