Leading News Portal in Telugu

King Cobra: ఇంట్లోకి కింగ్ కోబ్రా, చాకచక్యంగా పట్టుకున్న క్యాచర్.. వీడియో ఇదిగో!


King Cobra: ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది భయపడేది పాములకే. విషపూరిత పాముల జోలికి ఎవరూ కావాలని వెళ్లరు. పాములు ఉన్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయపడతారు. అయితే కొందరు మాత్రం పాములతోనే సహవాసం చేస్తారు. పాముల నుంచి మనుషులను, మనుషుల నుంచి పాములను రక్షించేందుకు ధైర్యంగా ముందడుగు వేస్తారు. అలాంటి ఎంతో మంది వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఓ స్నేక్‌ క్యాచర్ 13 అడుగుల కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నాడు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఎం.కోడూరులో కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. 13 అడుగులు గిరినాగు ఎలమంచిలి రమేష్‌ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించింది. 13 అడుగుల నల్లటి గిరినాగును గమనించిన వారు భయాందోళనకు గురయ్యారు. ఆ ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు.

వారు ఇంట్లో నుంచి బయటపడిన తర్వాత స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించారు. దీంతో స్నేక్ క్యాచర్‌ అక్కడికి చేరుకుని విషపూరితమైన ఆ పామును ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. పట్టుకున్న అనంతరం అటవీ శాఖ అధికారుల సమక్షంలో అటవీ ప్రాంతంలో ఆ పామును విడిచిపెట్టారు. .గిరినాగులు ప్రజలకు ఎలాంటి హాని చెయ్యవని విష సర్పాలను వేటాడతాయని అటవీ సిబ్బంది తెలిపారు. అవి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు కోరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.