Leading News Portal in Telugu

Vizag City: వైజాగ్‌ సిటీపై స్పెషల్‌ ఫోకస్‌.. పోలీసు శాఖలో కీలక మార్పులు


Vizag City: ఆంధ్రప్రదేవ్‌లో అతిపెద్ద నగరం విశాఖపట్నం. పారిశ్రామిక, ఓడరేవు నగరంగా వేగంగా విస్తరిస్తోంది. సిటీ ఆఫ్ డెస్టినీగా పిలుచుకునే వైజాగ్ ను పరిపాలన రాజధానిగా ప్రకటించింది వైసీపీ సర్కార్. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అవసరాలకు తగ్గట్టు మౌలిక సదుపాయాల కల్పన వేగవంతంగా జరుగుతున్నాయి.. దసరా నాటికి సీఎం వైఎస్‌ జగన్‌.. వైజాగ్ కేంద్రంగా పరిపాలన ప్రారంభిస్తారని అధికారపార్టీ వర్గాలు ఖచ్చితంగా చెబుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఐపీఎస్ లు ఆకస్మిక బదిలీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సిటీ పోలీసు కమిషనర్ సీఎం త్రివిక్రమ్ వర్మ., లా అండ్‌ ఆర్డర్ డీసీపీ విద్యాసాగర్ నాయుడుని ఏకకాలంలో బదిలీ చేసింది. వీరిద్దరి ట్రాన్స్‌ఫర్స్‌ వెనుక అదుపుతప్పిన పోలీసింగ్., రాజకీయ ప్రమేయాలు, బెంగాల్ విద్యార్థిని రీతు మృతి కేసు విచారణ లోపాలు.. ఇలా అనేక కారణాలు దాగి ఉన్నట్టు చర్చ జరుగుతోంది.

ఇక, వీటి సంగతి పక్కన బెడితే తాజా బదిలీల్లో విశాఖ పోలీసు బాస్ గా రవిశంకర్ అయ్యంగార్ నియామకంపై ఇప్పుడు ఆసక్తికరమైన వ్యవహారంగా కనిపిస్తోంది. అడిషనల్ డీజీపీ హోదాలో స్టేట్ లా అండ్‌ ఆర్డర్ పర్యవేక్షిస్తున్న అధికారిని విశాఖకు పంపడం వెనుక ప్రభుత్వ పెద్దలు ఆలోచన విస్పష్టం. కేపిటల్ సిటీగా మారిన తర్వాత విశాఖ పోలీసింగ్ కొత్త సవాళ్లను ఎదుర్కోవాలసి వుంటుంది. శాంతిభద్రతలు, ప్రోటోకాల్ నిర్వహణ పెద్ద ఛాలెంజ్. ప్రస్తుతం విశాఖ సిటీ పోలీసు కమిషనరేట్ పరిధి 40 నుంచి 50 కిలోమీటర్ల వైశాల్యంలో ఉంటుంది. జనాభా సుమారు 25 లక్షలు కాగా జనావాసాలు విస్తరిస్తున్నాయి. సిటీలో క్రైమ్ రేట్ ఆందోళన కలిగిస్తోంది. ఆర్గ నైజ్డ్ నేరాలు చేసే ముఠాల కదలికలు ఎక్కువయ్యాయి. వీటిలో సంచలనం రేకెత్తించిన ఘటనలు ఉన్నాయి. ఇప్పటి వరకు విశాఖలో జరిగిన నేరాల తీరు., వాటిని నియంత్రించే క్రమంలో తీసుకున్న చర్యలు ఒక లెక్క. రాజధాని కార్యాకలాపాలు ప్రారంమైతే భద్రత, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్దీకరణ వంటివి చాలా కీలకం.

సిటీ అవసరాలు, రాజధాని హంగులకు తగ్గట్టుగా పోలీసింగ్ మార్పులకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో రవి శంకర్ అయ్యంగార్ తో పాటు డీసీపీ-1గా నిబద్ధుడైన అధికారిగా గుర్తింపు పొందిన నాన్ కేడర్ ఎస్పీ శ్రీనివాస్ నియామకం జరిగింది. సిటీలో రెండు జోన్1, జోన్ 2 డీసీపీ, ఒక క్రైమ్ డీసీపీలు వున్నారు. సిటీలో జరుగుతున్న డైలీ యాక్టివిటీస్ తో పాటు క్రైమ్ సంబంధిత కేసుల దర్యాప్తు లో వీరి పాత్ర కీలకమైంది. టీడీపీ ప్రభుత్వంలో డీఐజీని జాయింట్ పోలీసు కమిషనర్ పోస్టు ఏర్పాటు చేసింది. ఇద్దరు అధికారులు జేసీపీలుగా సమర్ధవంతంగా పని చేశారు. ఆ తర్వాత కాలంలో జేసీపీ పోస్టు నియామకం జరగలేదు. రాజధాని నేపథ్యంలో ఇప్పుడు జాయింట్ పోలీసు కమిషనర్ హోదాలో సీనియర్ ఐ.ఏ.ఎస్ రానున్నారనేది అంచనా. కీలకమైన జాయింట్ సీపీతో పాటు వివిధ స్థాయిల్లో ఖాళీల భర్తీకి ప్రయారిటీ ఇవ్వనుంది. అలాగే, సీఎం క్యాంప్‌ కార్యాలయంగా ప్రచారం జరుగుతున్న ఋషికొండలో నూతన పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానుంది. 25 లక్షల పైబడిన జనాభా కలిగిన గ్రేటర్ నగరంలో లా అండ్ ఆర్డర్, ప్రోటోకాల్ పోలీసులకు నిత్యం ఛాలెంజ్ విసురు తుంది. ఈ క్రమంలో విశాఖ నగరంలో త్వరలో రెండు కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి..

అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్, సీఎం క్యాంప్ కార్యాలయం వచ్చే ఏరియా కావడంతో ఋషికొండ ప్రాంతంలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనేది అధికారులు తేల్చారు. రాజధాని కోసం సబ్ డివిజన్ లో మార్పుల నేపథ్యంలోనే కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక నగరంలో రుషికొండ పోలీస్ స్టేషన్ ప్రధాన పోలీస్ స్టేషన్ గా మారనుంది. ఇక్కడ సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయనుండటంతో ఈ స్టేషన్ ప్రాధాన్యత పెరగనుంది. ఇక్కడ పూర్తిస్థాయిలో నిఘాతోపాటు కట్టు దిట్టమైన భద్రతను ఏర్పాటు
చేయాల్సిన అవసరం ఉంది. ఇక గోపాలపట్నం, పెందుర్తి పోలీస్ స్టేషన్ ల పరిధిలో నేరాల సంఖ్య ఎక్కువగా పెరగడం, అది ఆ స్టేషన్లపై మరింత ఒత్తిడి పెరిగేందుకు కారణం అవుతూ ఉండటంతో కొత్తగా వేపగుంట పోలీస్ స్టేషన్ కు ప్రతిపాదనలు చేశారు. అదే కాకుండా భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే ఒక సెంట్రల్ డివిజన్ వచ్చే
అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.