Bhumana Karunakar Reddy: తిరుమలకు నడకదారిలో వెళ్లాలంటేనే వణికిపోయే పరిస్థితి వచ్చింది.. అయితే, భక్తుల భద్రతే మత ధ్యేయంగా చర్యలకు పూనుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి ఆపరేషన్ చిరుత ప్రారంభించింది.. ఇప్పటి వరకు ఐదు చిరుతలను బంధించింది. మరోవైపు.. నడకదారిలో వెళ్లే భక్తులకు ఊతకర్రలను పంపిణీ చేస్తోంది.. అయితే, ఈ నిర్ణయం తర్వాత టీటీడీపై విమర్శలు పెరిగాయి.. అయితే, ఐదో చిరుత చిక్కిన ప్రాంతాన్ని డీఎఫ్‌వో సతీష్‌రెడ్డితో కలిసి పరిశీలించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన శ్రీవారి భక్తుల భధ్రతలో రాజీపడం అని స్పష్టం చేశారు.. రెండు సార్లు చిరుత దాడులు చేసిన నేపథ్యంలో ఐదు చిరుతలను బంధించామని వెల్లడించారు. ఆపరేషన్ చిరుత నిరంతరాయంగా కొనసాగుతుందని ప్రకటించిన ఆయన.. 300 మంది అటవీ శాఖ సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తున్నారని తెలిపారు.
ఇక, ఊత కర్రల పంపిణీ విషయంలో వస్తున్న విమర్శలపై స్పందించిన టీటీడీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి.. భక్తుల్లో భరోసా కల్పించడానికి ఈతకర్రలను పంపిణీ చేస్తున్నాం అన్నారు.. ఈతకర్రల నిర్ణయం తీసుకున్న తర్వాత నాలుగు చిరుతలను బంధించామని గుర్తుచేశారు. మా పై విమర్శలు చేసినా.. భక్తుల భధ్రతపై రాజీపడేది లేదని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. మరోవైపు.. బోనులో చిక్కిన ఐదో చిరుతను క్వారంటైన్ కి తరలిస్తాం అని డీఎఫ్‌వో సతీష్ రెడ్డి వెల్లడించారు. దాడి చేసిన చిరుతను గుర్తించేందుకు శాంప్లిల్స్ ని పంపాం..నివేదిక వచ్చిన తరువాత నిర్దారణ చేస్తామన్న ఆయన.. నడకదారి వైపున వన్యప్రాణుల సంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం అన్నారు. రోడ్డు, నడకమార్గంలో నిరంతరాయంగా పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు డీఎఫ్‌వో సతీష్‌రెడ్డి.