Minister Usha Sri Charan: టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి ఉషాశ్రీచరణ్ సవాల్ విసిరారు. మీరు హెరిటేజ్ ఆస్తులు పేదలకు పంచుతారా?.. అలా చేస్తే నేను కొనుగోలు చేసిన భూములు కూడా పంచేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు. తనది సంపన్న కుటుంబమని.. తాను భూములు కొంటే తప్పా అంటూ మంత్రి ప్రశ్నించారు. రెండు ఎకరాల నుంచి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించావ్ అంటూ మంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు, నారా లోకేష్ నుంచి బీసీలకు రక్షణ కావాలని ఆమె పేర్కొన్నారు. భైరవానితిప్ప ప్రాజెక్టుకు శిలాఫలకం వేసి మరచిపోయింది గుర్తులేదా అంటూ ప్రశ్నలు గుప్పించారు. భైరవానితిప్ప ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దేనని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు.
ఇటీవల మంత్రి ఉషాశ్రీచరణ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు పలు ఆరోపణలు చేశారు. మంత్రి కబ్జాలకు పాల్పడ్డారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోపణలపై మంత్రి స్పందిస్తూ సవాల్ విసిరారు. అంతకుముందు కూడా చంద్రబాబుపై మంత్రి ఉషశ్రీ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కళ్యాణదుర్గం పర్యటన నేపథ్యంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబుకు మంత్రి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు కళ్యాణదుర్గానికి ఏం చేశారని నిలదీశారు. కళ్యాణదుర్గం పర్యటనలో సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తే సహించేది లేదని మంత్రి ఉషాశ్రీ చరణ్ హెచ్చరించారు.