Chandrababu Arrest: స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబును కాసేపట్లో విజయవాడలోని సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం విజయవాడ సివిల్ కోర్టు వద్ద భారీగా పోలీసుల మోహరించారు. 3వ అదనపు జిల్లా, ఏసీబీ కోర్టు జడ్జి వద్ద చంద్రబాబును హాజరుపరచనున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో దాదాపు 200 మంది పోలీసులు కోర్టు వద్ద మోహరించారు. స్పెషల్ పార్టీ, టాస్క్ ఫోర్స్, సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ బెటాలియన్ లతో రక్షక వలయంగా ఉన్నారు.
మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుధ్ర వాదనలు వినిపించనున్నారు. ఈ సందర్భంగా.. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సిద్ధార్థ లోధ్రా అండ్ టీమ్ గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించనున్నారు సిద్ధార్థ లుద్ర. ఇదిలా ఉంటే.. సీఐడి, సీట్ తరపున ఏఏజీ(అదనపు అడ్వకేట్ జనరల్) పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వైయన్ వివేకానంద స్పెషల్ పీపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పరేషన్ వాదనలు వినిపించనున్నారు.