Leading News Portal in Telugu

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ పై ప్రారంభమైన వాదనలు


ఓపెన్ కోర్టులో విచారణకు బెంచ్ కి ఏసీబీ న్యాయమూర్తి వచ్చారు. విచారణ ప్రక్రియ ప్రారంభం అయ్యాక 30 మంది న్యాయవాదులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఉండాలని ఆయన పేర్కొన్నారు. అంతకు మించి ఉంటే విచారణ ప్రక్రియ మొదలు కాదని ఏసీబీ న్యాయమూర్తి వెల్లడించారు. కోర్టు ప్రొసీడింగ్స్ లో పాల్గొన్న సీఐడీ తరపున 15 మందికి, చంద్రబాబు తరపున 15 మందికి అవకాశం ఇచ్చారు. విచారణ ప్రక్రియలో సీఐడీ తరపున 15 మంది, చంద్రబాబు తరపున 15 మంది పాల్గొన్నారు.

ఇక, చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తామని ముగ్గురు న్యాయవాదులు కోరారు. ఇద్దరికి మాత్రమే జస్టిస్ హిమ బిందు అవకాశం ఇచ్చింది. న్యాయవాదులు సిద్ధార్థ లూద్రా, పోసాని వెంకటేశ్వర రావు పేర్లు చెప్పగా వారికి న్యాయమూర్తి పర్మిషన్ ఇచ్చింది. 409 సెక్షన్ కింద వాదనలు జరుగుతున్నాయి.. అసలు ఈ సెక్షన్ ఈ కేసులో పెట్టడం సబబు కాదని లూద్రా వాదనలు ప్రారంభించారు. 409 పెట్టాలి అంటే ముందుగా సరైన సాక్ష్యం చూపాలని ఆయన పేర్కొన్నారు.

అయితే, రిమాండ్ రిపోర్ట్ ను తిరస్కరించాలని సిద్ధార్థ లూద్రా నోటీసు ఇచ్చాడు. తిరస్కరణపై వాదనలకు న్యాయమూర్తి హిమ బిందు అనుమతి ఇచ్చింది. దీంతో ఇరు వర్గాల మధ్య వాదనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. అంతకు ముదు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. గతరాత్రి సుదీర్ఘంగా ఆయన్ను విచారించిన అధికారులు.. రిమాండ్‌ రిపోర్టును కోర్టుకు సమర్పించారు.