Leading News Portal in Telugu

CPI Ramakrishna: కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే చంద్రబాబు అరెస్ట్


స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. లండన్ నుంచే చంద్రబాబు అరెస్టును సీఎం జగన్ మానిటరింగ్ చేస్తున్నాడు అని ఆయన అన్నారు. దమ్మున్నోడని చెప్పే జగన్ లండన్ కి వెళ్ళి ఎందుకు దాక్కున్నాడు.. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

సీఐడీని జగన్ ప్రైవేట్ సైన్యంగా మార్చుకోండి అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఒక రూల్.. చంద్రబాబుకు ఇంకో రూలా?.. అని ఆయన ప్రశ్నించారు. ఎంపీ అవినాష్ రెడ్డి కేసులో సీబీఐకి ఎందుకు సహకరించలేదు.. చంద్రబాబు విషయంలో మాత్రం సీఐడీ తెగ హడావిడి చేసింది అని రామకృష్ణ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది అని ఆరోపించారు.

సీఎం జగన్ పిచ్చి పరాకాష్టకు చేరింది అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎందుకు ఆపారు?.. సంఘీభావం తెలిపేందుకు కూడా అనుమతినివ్వరా?.. రేపు విజయవాడకు వెళుతున్నా.. చంద్రబాబుకు సంఘీభావం చెబుతున్నామని ఆయన పేర్కొన్నారు. రేపు విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం.. ప్రతిపక్ష పార్టీలన్నీ సమావేశానికి హాజరవ్వాలి.. చంద్రబాబు అరెస్ట్ పై ప్రజా సంఘాలు స్వచ్ఛంధంగా ముందుకు రావాలి అని రామకృష్ణ పిలుపునిచ్చారు.