Leading News Portal in Telugu

Sajjala: చంద్రబాబు జీవితమంతా అక్రమ మార్గాలే


స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు జీవితమంతా అక్రమ మార్గాలేనని సజ్జల మండిపడ్డారు. ఈ కుంభకోణానికి రూపకర్త, నిర్మాత, దర్శకత్వం అన్నీ చంద్రబాబేనని ఆరోపించారు. ఈ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నందునే నిన్న(శనివారం) అరెస్ట్ చేశారని సజ్జల స్పష్టం చేశారు. ఈ కేసు సంవత్సరం కిందే దర్యాప్తు మొదలైందని, తీగ లాగితే డొంక కదిలిందని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా లోకేష్, పవన్ కల్యాణ్ వ్యహరించారని దుయ్యబట్టారు.

మరోవైపు ఇవాళ చంద్రబాబును రిమాండ్ కు పంపడం అనేది పెద్ద విషయం అని మేం భావించడం లేదని సజ్జల పేర్కొన్నారు. దర్యాప్తు ప్రక్రియలో అదొక భాగమని.. ఇందులో ఆరోపణలు రుజువు చేయాల్సి ఉందని తెలిపారు. ఆధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి నేరారోపణ రుజువవుతుందని చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ సంస్థను చంద్రబాబు పూర్తిగా తన కిందనే పెట్టుకున్నాడని సజ్జల ఆరోపించారు. సీఎస్, ఆర్థిక కార్యదర్శి తదితర అధికారులు కూడా సీఎం చెబితేనే చేశామని స్పష్టంగా చెప్పారని.. ఇంత భారీ కుంభకోణం జరిగిందన్నారు. 40 ఏళ్లుగా చంద్రబాబు ఎన్నో స్కామ్‌లు చేశారని పేర్కొన్నారు. తప్పు చేయకుంటే రూ.కోటి ఇచ్చి లాయర్‌ను ఎందుకు తెచ్చుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే.. నిన్న సొంత కొడుకు కంటే దత్తకొడుకు వీరంగం ఎక్కువైపోయిందని సజ్జల విమర్శించారు. తన ఇంట్లో పడుకున్నట్టు జగ్గయ్యపేట రోడ్డుపై కాలుమీద కాలేసుకుని విలాసంగా పడుకున్నాడని ఆరోపించారు. మరోవైపు చంద్రబాబు నిన్న పెద్ద డ్రామా చేశాడని తెలిపారు. పెద్దాయన, మాజీ ముఖ్యమంత్రి కావడంతో హెలికాప్టర్ ఏర్పాటు చేశామని.. కానీ పబ్లిసిటీ కోసం ఉహూ అన్నాడని తెలిపారు. నిన్న విచారించిన డీఐజీ కూడా మామూలుగానే వ్యవహరించాడని.. అవతలున్నది మాజీ సీఎం కావడంతో ఎందుకులే అనుకుని ఉండొచ్చన్నారు. కానీ ఆయన కొడుకు ఓ సీఐని మాట్లాడింది మామూలు బూతులా? మాజీ సీఎం కొడుకు అని గౌరవిస్తే, వాళ్ల పాలేర్లు అన్నట్టుగా మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా జగన్ ధైర్యంగా నిలబడ్డారని.. జగన్ కు ఇతరులకు చాలా తేడా ఉంది” అంటూ సజ్జల పేర్కొన్నారు.