స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతుంది. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బృందం వాదనలు వినిపిస్తుండగా.. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, పోసాని వెంకకటేశ్వరరావు వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఇరుపక్షాల వాదనలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి దాదాపు 5 గంటలుగా వాదనలు జరిగాయి.
అయితే ప్రస్తుతం విచారణకు గంట పాటు లంచ్ టైం ఇచ్చారు. విరామం అనంతరం మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత కోర్టులో విచారణ తిరిగి స్టార్ట్ అవుతుంది. విచారణ జరుగుతున్న సమయంలో చంద్రబాబు కొడుకు లోకేష్ కూడా కోర్టులోనే ఉన్నారు. అయితే వాదనల అనంతరం ఏసీబీ న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇక, చంద్రబాబుపై సెక్షన్ 409 నమోదుపై కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన తరఫున లాయర్ క్యాశ్చన్ చేశారు. ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 409 చంద్రబాబుకు వర్తించదని వాదించారు. ఈ సమయంలో ఏఏజీ సుధాకర్ రెడ్డి.. ఈ కేసులో ఏ 35 ఘంటి వెంకట సత్య భాస్కర్ ప్రసాద్‌ను అరెస్ట్ చేసినప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పే.. ఇప్పుడు చంద్రబాబుకు సైతం 409 వర్తిస్తుందని ఆయన తెలిపారు.
అయితే, రిమాండ్ రిపోర్టులో అన్ని అంశాలు ప్రస్తావించామని కోర్టుకు సీఐడీ సిట్ తరఫు న్యాయవాదులు తెలిపారు. రిమాండ్ రిపోర్ట్ లోని పేజ్ 19 పెరా 8లో అన్ని అంశాలు పూర్తిగా పొందు పరచమన్నారు. ఈ కేసులో ప్రధాన నింధితుడిగా ఉన్న కిలారు రాజేశ్ ద్వారానే ఇదంతా జరిగిందని ఏసీపీ కోర్టుకు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబును ప్రభుత్వం టార్గెట్ చేసిందని లాయర్ లూథ్రా పేర్కొన్నారు. చంద్రబాబును కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇక, ఏసీబీ కోర్టులో వాదనలు ముగింపు దశకు చేరుకోడవడంతో న్యాయమూర్తి నిర్ణయం ఎలా వుంటుందో అన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరి కొద్దిసేపట్లో వాదనలు ముగిసి కోర్టు తీర్పు వెలువడే ఛాన్స్ ఉండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కోర్టు ప్రాంగణంతో పాటు విజయవాడలో భారీగా పోలీసులీ మొహరించారు.