Ambati Rambabu: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పొలిటీషియన్ అరెస్ట్ కావడం, జైలుకు వెళ్లడం బాధాకరమే. అయితే ఆ పొలిటీషియన్ ఎలాంటి వ్యక్తి, రాజకీయ జీవితం ఏంటనేది కూడా చూడాలని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతి గురించి రాష్ట్రంలో ప్రతీఒక్కరికీ తెలుసని.. ఆధారాల్లేకుండా కోర్టులు తీర్పులు ఇవ్వవనే విషయం గుర్తించాలని అంబటి రాంబాబు పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో సానుభూతి పొందాలని టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎంత అవినీతి చేసినా వ్యవస్థల్ని మేనేజ్ చేయగలరని ఇంతకాలం నమ్మారని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 9న ఉదయం అరెస్ట్ చేసినప్పటి నుంచి రాజకీయ డ్రామాలు చేశారని మండిపడ్డారు. .. నంద్యాల నుంచి విజయవాడకు హెలికాప్టర్‌లో తీసుకెళ్తామన్నా, రాజకీయాల కోసం రోడ్డుమార్గంలో వస్తామన్నారని ఆయన తెలిపారు. ఇన్ని అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డప్పటికీ.. వ్యవస్థల్ని మేనేజ్ చేసి బోనెక్కకుండా వస్తున్నారని, కానీ, రాష్ట్ర ప్రజల అదృష్టమో, ఆయన దురదృష్టమో.. ఇప్పుడు అరెస్టయ్యారని అన్నారు.
ఓటుకు నోటు కేసులో వ్యవస్థల్ని మేనేజ్ చేసే తప్పించుకున్నారని ఆయన ఆరోపించారు. స్కిల్ స్కామే కాదు.. ఇంకా చాలా కుంభకోణాలు ఉన్నాయన్నారు. చంద్రబాబుకు నేరాలు కొత్తకాదని, ఆయన చేసిన స్కాములు గుర్తించడమే ఇప్పుడు కొత్త అంటూ ఆయన మండిపడ్డారు. ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, అమరావతి ఇలా.. చాలా కుంభకోణాలు ఉన్నాయన్నారు. నిరసనలకు ఎవరూ రావట్లేదని అచ్చెన్న అసహనంతో మాట్లాడుతున్నారన్నారు. పవన్ కల్యాణ్‌కు ఇంగిత జ్ఞానం లేదని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఎన్ని అక్రమాలు చేసినా పవన్ చంద్రబాబును సమర్థిస్తున్నారన్నారు. మేము ప్యాకేజీ అని చెబుతున్నది నిజం కాదా అన్నది పవన్ ఇప్పుడు చెప్పాలని ప్రశ్నించారు. అరెస్ట్ అయినప్పటి నుంచి రాజకీయ డ్రామాలాడారన్నారు. కుట్రలకు తెరలేపారని ఆయన తీవ్రంగా స్పందించారు.
ఎన్నికలకు ముందు చంద్రబాబును అరెస్ట్ చేయించాల్సిన అవసరం మాకేంటని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో అనేక స్కామ్‌లు జరిగాయని, చాలా కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్.. రిమాండ్.. కక్ష పూరిత చర్య అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కోర్టు రిమాండ్ మీద బంద్‌కు పిలుపునిచ్చారా అంటూ టీడీపీ, జనసేనలను ఉద్దేశించి ప్రశ్నించారు.