Minister Kakani Govardhan Reddy: తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పలేదు.. అవినీతికి పాల్పడ్డారు కాబట్టే..
Minister Kakani Govardhan Reddy: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే అరెస్ట్ చేశారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని.. స్కిల్ డెవలప్మెంట్‌కేసులో నిందితుడిగా న్యాయస్థానం నిర్ధారించిందన్నారు. బంద్‌కు పిలుపునిస్తే ప్రజల్లో స్పందన లేదన్నారు. చంద్రబాబును అవినీతి పరుడుగా ప్రజలు నమ్ముతున్నారని మంత్రి చెప్పారు. అందుకే ఎవరూ బయటకు రాలేదన్నారు. లోకేష్ తన ఎర్ర పుస్తకంలో ప్రధానంగా చంద్రబాబు పేరు రాసుకోవాలన్నారు. కేసులో అవినీతికి పాల్పడలేదని విచారణ సందర్భంగా చెప్పలేదన్నారు. తాను తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పలేదని మంత్రి వెల్లడించారు. కేబినెట్ నిర్ణయమని, తనకు సంబంధం లేదని చెబుతూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.
అప్పట్లో జగన్‌కు సంబంధం లేకపోయినా కేసుల్లో ఇరికించారన్నారు. అప్పుడు కూడా కేబినెట్ నిర్ణయాలే కదా.. అప్పుడు జగన్ ఏ హోదాలోనూ లేరని ఆయన స్పష్టం చేశారు. “గతంలో కమ్యూనిస్టులు చంద్రబాబును అవినీతి పరుడన్నారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తే అక్రమం అంటున్నారు. అన్ని పథకాల్లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు. పిల్లలకు ఇచ్చే శిక్షణలో రూ.370 కోట్ల మేర నిధులు మింగేశారు. 10 గంటలు వాదనలు విని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వచ్చి రోడ్డు మీద పడుకున్నారు. ఇద్దరూ ప్యాకేజీలు పంచుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో పవన్‌కు కూడా వాటాలు వచ్చాయి. రాజధాని పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారు. ప్రజల దృష్టి మరల్చి…అమరావతిలో తన అనుచరుల వద్ద భూములు కొని రాజధాని పెట్టించారు. ఓటుకు నోటు కేసులో కూడా చంద్రబాబు ముద్దాయి. పేదలకు చెందిన భూములను కొట్టేసిన చరిత్ర చంద్రబాబుది.” అంటూ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.