Chandrababu Arrest: చంద్రబాబు ఇంట్లో ఉండటం కంటే రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండడమే సేఫ్ అంటూ ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు సీఐడీ తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులుఏజీ శ్రీరామ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, స్పెషల్ జీపీ వివేకానంద.. సెంట్రల్ జైలులో చంద్రబాబు భద్రత కోసం తీసుకున్న చర్యలకు సంబంధించి అడ్వకేట్ జనరల్ కు లేఖ రాశారు హోం సెక్రటరీ.. ఆ లేఖను కోర్టుకు సమర్పించారు ఏజీ శ్రీరాం.. ఏసీబీ కోర్టులో చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై విచారణ సందర్భంగా వాడివేడిగా వాదనలు సాగాయి.. చంద్రబాబును హౌస్ కస్టడీ ఇవ్వాలన్న పిటిషన్లపై లోధ్రా.. పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
చంద్రబాబు పూర్తి ఆరోగ్యంగా.. పూర్తి భద్రత నడుమన ఉన్నారని కోర్టుకు తెలిపారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. ఇంట్లో ఉండటం కంటే సెంట్రల్ జైలులో ఉండటం చంద్రబాబుకు సేఫ్ అన్న ఆయన.. సుప్రీం కోర్టు ఇచ్చిన కేసు తీర్పును చంద్రబాబు కేసుకు ముడి పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. వీఐపీ ముద్దాయికి కల్పించే అన్ని వసతులు జైల్లో కల్పించాం. చంద్రబాబుకు జైల్లో పూర్తిగా సెక్యూరిటీ కల్పించాం.. జైలులో మాత్రమే కాదు.. జైలు పరిసర ప్రాంతాల్లో పోలీసులు సెక్యూరిటీ ఉంది.. 24 గంటలు పోలీసులు డ్యూటీలో ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరం అయుతే వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక, ఆర్థిక నేరాల్లో సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని.. అందుకే చంద్రబాబుకు హౌస్ అరెస్ట్‌కు అనుమతించవద్దని వాదనలు వినిపించారు.. ఇక, చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు ముగియడంతో.. సాయంత్రం 4.30 గంటలకు తీర్పు వెలువరించనుంది ఏసీబీ కోర్టు.