ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. జగన్ దంపతులు నేడు ( మంగళవారం ) గన్నవరం చేరుకున్నారు. పది రోజులు లండన్ టూర్ ముగించుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సీఎం జగన్ కు మంత్రులు జోగి రమేష్, విశ్వరూప్, డీజీపీ, సీఎస్, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.
ఇక విజయవాడ చేరుకున్న సీఎం జగన్ గన్నవరం నుంచి రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లారు. అయితే, సీఎం జగన్ ఇవాళ రాష్ట్రంలో శాంతిభద్రతలు, తాజా పరిణామాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. విదేశీ పర్యటన ముగిసిన వెంటనే సీఎం వైఎస్ జగన్ రేపు ఢిల్లీ పర్యటకు వెళ్లనున్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెడతారని ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో హై-టెన్షన్ నెలకొంది.. దీంతో రాష్ట్రంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో రేపు సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊహాగానాలు వస్తున్నా చెలరేగుతున్న తరణంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. లండన్ పర్యటనను ముగించుకొని వచ్చిన వెంటనే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే, 13న ఢిల్లీ, 14న నిడదవోలు, 15న విజయనగరం పర్యటనలపై ఇవాళ (మంగళవారం) సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.