స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో పలు పార్టీలకు చెందన నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. దీంతో నేడు ( మంగళవారం ) విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని శాంతి భద్రతలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత పది రోజులుగా జరిగిన పరిణామాలను సీఎం జగన్ కు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి సహా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు వివరించారు.
ఇక, చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలను ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సీఎం జగన్ కు వివరించారు. కోర్టులో జరిగిన వాద ప్రతివాదనల తీరును పోన్నవోలు వివరించారు. చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా టీడీపీ చేపట్టిన ఆందోళనలు.. నిన్నటి బంద్ వంటి అంశాలను సీఎం జగనుకు పోలీస్ అధికారులు తెలియజేశారు. మరి కొంత మంది అరెస్టులు ఉంటాయనే ప్రచారంతో సీఎం జగన్ లా అండ్ ఆర్డర్ రివ్యూ ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే, భవిష్యత్‌లో రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ముఖ్య నేతలు వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.