Leading News Portal in Telugu

ACB Court: చంద్రబాబు కేసు ఎఫెక్ట్‌..! ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి భద్రత..


ACB Court: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు విచారణతో ఒక్కసారిగా విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుపై ఫోకస్‌ పెరిగింది.. చంద్రబాబు అరెస్ట్‌.. 14 రోజుల రిమాండ్‌తో పాటు.. ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన చంద్రబాబు హౌస్‌ రిమాండ్‌ పిటిషన్‌ కూడా తిరస్కరణకు గురైంది.. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమబిందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భద్రత పెంచింది. 4+1 ఎస్కార్ట్‌తో భద్రత కల్పించింది సర్కార్‌.. కాగా, ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో దాఖలైన పలు పిటిషన్లపై న్యాయవాది హిమబిందు విచారణ జరుపుతోన్న విషయం విదితమే.. ఈ నేపథ్యంలో ఎలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా.. జస్టిస్ హిమబిందుకు ప్రభుత్వం భద్రత పెంచినట్టు తెలుస్తోంది. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన హౌస్ కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ఎలాంటి ముప్పు లేదన్న సీఐడీ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించింది. భద్రతపై చంద్రబాబు తరపు లాయర్లు చేసిన వాదనలను న్యాయస్థానం తిరస్కరించిన విషయం విదితమే.