విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏదైనా కష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్నారో లేక మరేదైనా దారుణం జరిగిందో తెలీదు… బావిలో ఓ కుటుంబం మొత్తం శవమై తేలింది. పెళ్ళీడుకు వచ్చిన కూతురితో సహా దంపతులు మృతి చెంది కనిపించారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నంలోని మర్రిపాలెంలో ఎండీ మహముద్దీన్ కుటుంబంతో కలిసి జీవించేవారు. ఏం జరిగిందో తెలీదుగానీ కుటుంబంతో సహా వ్యవసాయ బావిలో పడి మృతిచెందారు. మహముద్దీన్ ఆయన భార్య షరీష నిషా, కూతురు ఫాతిమా బహిర మృతదేహాలు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామ శివారులో కనిపించాయి.
వ్యవసాయ పొలాల మధ్యలోని ఓ బావిలో ఈ మృతదేహాలను గుర్తించిన చింతలపాలెం రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నీటిపై తేలుతున్న మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చనిపోయింది మహముద్దీన్ కుటుంబంగా పోలీసులు గుర్తించి వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. అయితే, మృతులు మహముద్దీన్ కుటుంబంతో సహా క్యాబ్ లో వచ్చి కుమారుడు ఆలీకి ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నాము అని లోకేషన్ పెట్టి సూసైడ్ నోట్ పెట్టి చనిపోయినట్టు సమాచారం. ఈ ఘటనపై కొత్తవలస సీఐ చంద్రశేఖర్ వివరాలు సేకరిస్తున్నారు. అయితే, మహముద్దీన్ కుటుంబానిది హత్యా లేక ఆత్మహత్యా అన్నది తెలియాల్సి ఉంది అని పోలీసులు తెలిపారు.