Leading News Portal in Telugu

AP High Court: మూడు పిటిషన్లపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు


AP High Court: టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌తో పాటు మరో రెండు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. క్వాష్‌ పిటిషన్‌పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ నెల 18లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలా ఉండగా.. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు సమయం కావాలని సీఐడీ కోర్టును కోరింది. కౌంటర్‌ దాఖలుకు సమయమిచ్చిన కోర్టు.. విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌ను ఈ నెల 18 వరకు విచారించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అమరావతి ఇన్నర్‌ రింగ్ రోడ్డు కేసు పిటిషన్‌పై విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. చంద్రబాబు తరఫున హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది. సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు తరఫున పిటిషన్‌ దాఖలు చేయగా.. కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది.

క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ఏమందంటే?
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను ఉన్నత న్యాయస్థానం వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఇరువైపుల వాదనలు వినాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు రిమాండ్ రాజ్యాంగ విరుద్ధమని, చంద్రబాబు అరెస్టుకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోలేదని, రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను న్యాయమూర్తి ప్రశ్నించారు. గతంలో తాను పీపీగా పనిచేశానని, అభ్యంతరాలు ఉంటే చెప్పాలన్న జడ్జి.. అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్‌కు మారుస్తామని పేర్కొన్నారు. తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్న చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం వరకు కస్టడీపై నిర్ణయం తీసుకోవద్దని ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. అంటే అప్పటి వరకు కస్టడీ పిటిషన్‌పై విచారణ చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది.