Leading News Portal in Telugu

AP High Court: టీడీపీ నేతల గృహనిర్బంధం పిటిషన్‌పై హైకోర్టులో విచారణ


AP High Court: చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నిరసనలు తెలుపుతున్న టీడీపీ నేతల గృహానిర్బంధం పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఆ పార్టీ నేతలను గృహనిర్బంధం చేయడంపై వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ప్రతిపక్షాలను, ముఖ్యంగా టీడీపీ నేతలను టార్గెట్ చేస్తోందని పిటిషనర్ వాదనలు వినిపించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారని కోర్టు దృష్టికి పిటిషనర్ తరుపు న్యాయవాది యలమంజుల బాలాజీ తీసుకువచ్చారు. గృహ నిర్బంధం చేయడం చట్టవ్యతిరేకమైన చర్యని న్యాయవాది బాలాజీ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21కు ఈ చర్యలు విరుద్ధమని ఆయన కోర్టుకు విన్నవించారు. సుప్రీంకోర్టు నిబంధనలు ప్రభుత్వం ఉల్లంగిస్తోందని బాలాజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం వివక్ష పాటిస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.అధికార పార్టీ కార్యక్రమాలకు అనుమతులు ఇస్తూ… ప్రతిపక్షాలకు అనుమతులు నిరాకరిస్తోందని వాదించారు.

న్యాయవాది బాలాజీ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. కౌంటర్ ధాఖలు చేసేందుకు ప్రభుత్వం రెండు వారాల సమయం కోరింది. సీయస్, డీజీపీ, హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.