Leading News Portal in Telugu

Hacking: హ్య‘కింగ్’ వీడు.. రూ. 4 కోట్లు స్వాహా చేసిన ఏపీ ట్రిపుల్ ఐటీ గ్రాడ్యుయేట్..


Hacking: ట్రిపుల్ ఐటీ విద్యార్థులు టెక్నాలజీ పరంగా చాలా అత్యుత్తమంగా ఉంటారు. ఈ టెక్నాలజీని సరైన పనులు ఉపయోగిస్తే సాంకేతిక ప్రపంచాన్ని దున్ని పారెయెచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీ-ఒంగోలుకు చెందిన కంప్యూటర్ సైన్ గ్రాడ్యుయేట్ 23 ఏళ్ల యువకుడు మాత్రం దీన్ని అక్రమమార్గంలో ఉపయోగించాడు. చివరకు కటకటాల పాలయ్యాడు.

వివరాల్లోకి వెళితే ఏపీకి చెందిన ట్రిపుల్ ఐటీ గ్రాడ్యుయేట్ బొమ్మలూరు లక్ష్మీపతి ఓ వెబ్‌సైట్ ని హ్యాకింగ్ చేసి రూ.4.16 కోట్ల విలువైన రివార్డ్ పాయింట్లను స్వాహా చేశాడు. నిందితుడు ఏకంగా 6 లక్షల గిఫ్ట్ వోచర్లను రీడీమ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. లక్ష్మీపతిని అరెస్ట్ చేసినట్లు బెంగళూర్ పోలీస్ కమిషనర్ బీ దయానంద ప్రకటించారు. అతడి నుంచి 5 కిలోల బంగారంతో సహా రూ. 4.16 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది బెంగళూర్ సైబర్ క్రైమ్ పోలీసులు జరిపిన అతిపెద్ద సీజ్ ఇదే అని పోలీసులు తెలిపారు.

ఏపీకి చెందిన లక్ష్మీపతి ఒంగోలులోని ట్రిపుల్ ఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బెంగళూర్ లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగంలో చేరినట్లు పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ లో ఈ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తరువాత దుబాయ్ లో కొన్ని నెలలు పనిచేసి బెంగళూర్ తిరిగి వచ్చాడు. లక్ష్మీపతి కాలేజ్ రోజుల్లోనే హ్యాకింగ్ నేర్చుకున్నాడని పోలీసులు తెలిపారు. తన టాలెంట్ పరీక్షించుకునేందు9కు లాయల్టీ, రివార్డ్ ప్రోగ్రామ్స్ నిర్వహించే రివార్డ్ 360 సంస్థపై పరీక్షించాడు. ఏకంగా 6 నెలల పాటు వెబ్‌సైట్ ని హ్యాక్ చేసి గిఫ్ట్ వోచర్లను తన అకౌంట్ లో జమ చేసుకున్నాడు.

పోలీసులు కథనం ప్రకారం, లక్ష్మీపతి క్రెడిట్ కార్డు సమస్య రావడంతో తన బ్యాంకును సంప్రదించాడు. సమస్యను పరిష్కరించిన బ్యాంకు అతనికి పరిహారంగా రివార్డ్ 360 వోచర్ ఇచ్చారు. అయితే ఆసక్తిగా లక్ష్మీపతి ఈ రివార్డ్ 360 వోచర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందని పరీక్షించాడు. హ్యాకింగ్ స్కిల్స్ తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ..రివార్డ్ 360 సెక్యూరిటీని ఛేదించాడు. ఎప్పుడూ తాను గిఫ్ట్ వోచర్లు పొందేలా కోడ్ రూపొందించాడని పోలీసులు తెలిపారు.

బంగారం, వెండి, బైకుల కొనుగోలు చేయడానికి తన గిఫ్ట్ ఓచర్లను రీడీమ్ చేయడం ప్రారంభించాడు. డబ్బును సంపాదించి సైబర్ సెక్యూరిటీ సంస్థను ప్రారంభించడం లేదా దుబాల్ లో స్థిరపడాలని అనుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే ఒక నెల క్రితం రివార్డ్ 360 ఖాతాదారులు వోచర్లను రీడీమ్ చేయలేకపోవడంతో ఫిర్యాదులు చేశారు. దీంతో ఈ సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. అన్ని వోచర్లు ఒకే అకౌంట్ కు రీడీమ్ అయినట్లు తేలింది. జూన్ 24న పోలీసులను ఆశ్రయించగా.. లక్ష్మీపతి ఉదంతం వెలుగులోకి వచ్చింది.