Pawan Kalyan: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.. అయితే, ములాఖత్‌లో చంద్రబాబును కలిసేవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఇక నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ కలవబోతున్నారు. జనసేన అధినేత పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పర్యటనకు జనసేన నాయకులు రాకుండా పోలీసులు గృహనిర్బంధం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉండడంతో ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. నలుగురికి మించి ఉండకూడదని, ర్యాలీలు, నిరసనలకు అనుమతి నిబంధనలు అమలులో ఉంది.
నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుతో బాలయ్య, పవన్, లోకేష్ ములాఖత్ కానున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సెంట్రల్ జైలుకు రానున్నారు. అదే సమయానికి క్యాంపు నుంచి సెంట్రల్ జైలుకు బాలయ్య, లోకేష్ రానున్నారు. ములాఖత్ తర్వాత జైలు దగ్గర ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. నేడు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ రానున్న నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భద్రతను పెంచారు. 300 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రభుత్వాసుపత్రి , ఆర్ట్స్ కాలేజీల వద్ద భారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు దారి మళ్లింపు చేపట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి సెంట్రల్ జైలు వరకు ప్రధాన జంక్షన్ల వద్ద పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు.