Leading News Portal in Telugu

Anam Ramanarayana Reddy: మంచిదే కాదు..! మీరెందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై రూ.1,800 కోట్లు ఖర్చు చేశారు..!


Anam Ramanarayana Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌లో స్కామ్‌ జరిగిందని.. కేసులు నమోదు చేసి చంద్రబాబును అరెస్ట్‌ చేసిన విషయం విదితమే.. అయితే, అది మంచిది కాదైతే మీరెందుకు దానిపై ఖర్చు చేస్తున్నారు.. జగన్ ప్రభుత్వం రూ.1800 కోట్లను స్కిల్ డెవలెప్మెంట్ కోసం ఎందుకు ఖర్చు చేసిందని అని ప్రశ్నించారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ లో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరిగింది.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్ తన సొంత పనికి లండన్ కి వెళ్లి ప్రజాధనం రూ.43కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు.

మరోవైపు.. ఎఫ్ఐఆర్‌లో పేరే లేని చంద్రబాబుని అరెస్టు చేసి.. 600 కిలోమీటర్లు తిప్పుతూ చిత్రహింసలు పెట్టారని మండిపడ్డారు ఎమ్మెల్యే ఆనం.. చంద్రబాబు ఫోటోలు, వీడియోలను తనకి పంపే బాధ్యతని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సీఎం వైఎస్‌ జగన్‌ అప్పగించారని.. అవి చూస్తూ జగన్ ఆనందం పొందుతున్నాడంటే, అంతకంటే పైశాచికం ఉండదని వ్యాఖ్యానించారు. అయితే, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డిని ఈ విషయంలో పక్కన పెట్టాడు.. కుక్కల్లా తీసిపారేశారని భావిస్తారనే మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు, పార్టీల నేతలు.. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి.